ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయిలో ఎనలేని ప్రతిష్టను పొందాడు. 'బాహుబలి' విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రం మొదలుపెట్టినప్పటి నుండి ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 'బాహుబలి' విజయం తాలూకు క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి 'సాహో' చిత్ర టీమ్ కూడా శతవిధాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. 'రన్ రాజా రన్' తో హిట్ కొట్టిన దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో ఈ 'సాహో' చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని ఏకంగా 150 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో యువీ క్రియేషన్స్ వారు నిర్మిస్తుండడంతో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వచ్చేసింది. బాహుబలిలా జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించాలంటే ఈ చిత్రానికి అన్ని విధాలా ప్రత్యేక పబ్లిసిటీ చెయ్యడం.. అలాగే ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే విధంగా జాతీయ స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వడం వంటి అంశాలపై 'సాహో' టీమ్ దృష్టి సారించింది.
అలాగే చిత్రంలో నటించే నటీనటుల విషయంలో కూడా 'సాహో' టీమ్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుంది. ఇప్పటికే 'సాహో'లో ప్రభాస్ కి జోడిగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ ని తీసుకున్న టీమ్ ఇప్పుడు మరో ముఖ్య పాత్ర కోసం మరొక బాలీవుడ్ నటి మందిరా బేడీని కూడా తీసుకుంటున్నట్లుగా ప్రచారం మొదలైంది. అలాగే 'సాహో' కి క్రేజ్ తెచ్చే పనిలో బాలీవుడ్ నటులకు ఎక్కువగా ఓటేసిన చిత్ర టీమ్ అందులో భాగంగానే ఎక్కువగా బాలీవుడ్ నటులనే దింపుతోంది. ఇప్పటికే 'సాహో' చిత్ర విలన్స్ కోసం నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను ఆనంద్ వంటి వాళ్ళని తీసుకున్న చిత్ర టీమ్ ఇప్పుడు మరో బాలీవుడ్ నటి మందిరాని కూడా విలన్ పాత్రకే ఎంపిక చేసిందనే న్యూస్ వైరల్ అయ్యింది.
మరి నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ నటులతో పోటీపడి విలన్ పాత్రలో మందిరా ఎలా మెప్పిస్తుందో తెలియదు గాని, మందిర ఎంపిక విషయాన్ని 'సాహో' చిత్ర టీమ్ మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.