చాలాకాలం గ్యాప్ తర్వాత మరలా సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన చినబాబు అలియస్ రాధాకృష్ణ జోరు సామాన్యంగా లేదు. ఒకవైపు ఆయన తన హారిక అండ్ హాసిని పతాకంపై కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే చిత్రాలు చేస్తాను తప్ప.. ఈ బేనర్‌లో మరో దర్శకునితో చిత్రాలు తీయనని అనౌన్స్ చేశాడు. అన్నట్లుగానే 'జులాయి', 'అ ఆ', ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ - పవన్‌కళ్యాణ్‌ల కాంబినేషన్‌లో చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రహస్య భాగస్వామి అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి.
ఇక సూర్యదేవర నాగవంశీతో రాధాకృష్ణ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ని స్థాపించిన ఇందులో మీడియం హీరోలతో వేరే దర్శకులతో చిత్రాలు చేస్తున్నాడు. ఆ కోవలోకే నాగచైతన్య-చందు మొండేటిల 'ప్రేమమ్', వెంకటేష్ - మారుతిలతో 'బాబు బంగారం' చిత్రాలను నిర్మించారు. 'ప్రేమమ్' బాగానే ఆడినా 'బాబు బంగారం' సరిగా ఆడలేదు. తాజాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌లో మరో రెండు చిత్రాలకు శ్రీకారం చుడుతున్నారు. 'స్వామిరారా, దోచెయ్, కేశవ' చిత్రాల దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో యంగ్‌హీరో శర్వానంద్‌తో ఓ చిత్రాన్ని ఈ సంస్థ ప్రారంభించనుంది. సాధారణంగా సుధీర్‌వర్మకి క్రైమ్ థ్రిల్లర్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు అదే కోవలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సుదీర్‌వర్మ, శర్వానంద్‌తో చిత్రం చేయడానికి డిసైడ్ అయ్యాడు.
కాగా ప్రస్తుతం శర్వానంద్, మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' చిత్రం తీస్తున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 29న విడుదల చేయనుండగా, దీనిని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ 'మహానుభావుడు' చిత్రం తర్వాత మారుతినే పెట్టి నాగచైతన్య హీరోగా మరో చిత్రం నిర్మించనుంది. గతంలో మారుతి అక్కినేని అఖిల్‌తో రెండో చిత్రం చేయాలని భావించాడు. కానీ అది విక్రమ్ కె.కుమార్‌కి వెళ్లింది. దీంతో ఇప్పుడు మారుతి అఖిల్ అన్న నాగచైతన్యతో ఈ చిత్రం చేస్తుండటం విశేషం.