ఇండియన్ క్రికెట్‌కు దేవుడు సచిన్ టెండూల్కర్. ఇది కాదనలేని వాస్తవం. ఆయన తన కెరీర్‌లో తన జెర్సీపై 10 వ నెంబర్‌తో దిగేవాడు. ఇక సచిన్ రిటైర్ కావడంతో ఇక ఈ 10వ నెంబర్ జెర్సీని ఇంకెవ్వరూ వాడకూడదని సచిన్ అభిమానులు కోరుతున్నారు. 10వ నెంబర్ జెర్సీ సచిన్‌దే అయినా అంతకుముందు, ఆ తర్వాత క్రికెట్‌తో సహా అనేక క్రీడల్లో ఎందరో క్రీడాకారులు ఆ నెంబర్‌ని వాడారు.
ఇక తాజాగా శ్రీలంకతో జరిగిన నాలుగో వన్డే సందర్భంగా ఇండియా టీమ్‌లోకి కొత్తగా అరంగేట్రం చేసిన ఫాస్ట్‌బౌలర్ శార్దూల్ ఠాకూర్ పదో నెంబర్ జెర్సీతో కనిపించాడు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోచ్ రవిశాస్త్రి ద్వారా ఠాకూర్ ఇండియన్ క్యాప్‌ని అందుకున్నాడు. మొదట బ్యాటింగ్ సందర్భంగా ఠాకూర్ బ్యాటింగ్‌కి వచ్చే అవకాశం రాలేదు. కానీ శ్రీలంక బ్యాటింగ్ సందర్భంగా ఓపెనింగ్ బౌలర్‌గా ఠాకూర్ 10వ నెంబర్ జెర్సీని ధరించడం కొందరు సచిన్ అభిమానులకు కోపాన్ని మరికొందరికి అసహానాన్ని కలిగించింది. ఠాకూర్ కూడా ముంబై తరపునే ఆడతాడు.
ఇక ఆయన తన మొదటి మ్యాచ్‌లోనే ప్రారంభంలోనే తొలి వికెట్‌ని సాధించడమే కాదు.. ఏకంగా రమారమి 150 కిలోమీటర్ల వేగంగా బంతులు విసిరి మనకు మరో మంచి ఫాస్ట్ బౌలర్ లభించాడు అనే ఆశను పెంచాడు. ఇలా ఆరంగేట్రం చేసి మొదటి మ్యాచ్‌లోనే వికెట్, తన ఫాస్ట్, రన్నప్‌తో అందరినీ ఆకట్టుకున్న శార్దూల్ ఠాకూర్‌ని అభినందించాల్సింది పోయి ఆయన జెర్సీ నెంబర్‌పైనే పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఇంకా తమకు పెద్ద మనసు ఉంటే బ్యాటింగ్‌లో సచిన్ ఇండియాకు తన 10వనెంబర్ జెర్సీతో ఎంతటి సేవలు చేసి ఎన్నిరికార్డులు సాధించాడో, బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ కూడా అదే స్థాయిలో రాణించాలని కోరుకుని ఉంటే బాగుండేది.
కానీ అభిమానులు మాత్రం మరోలా భావించారు. 10వ నెంబర్ జెర్సీ రిటైర్ అయిపోయింది. ఇక ఆ నెంబర్‌ని ఎవ్వరికీ కేటాయించవద్దు అంటూ బిసిసిఐని కోరారు. పనిలో పనిగా శార్దూల్ ఠాకూర్‌ని కూడా సచిన్ జెర్సీ నెంబర్ వదులుకోవాలని సూచించారు. అయినా జెర్సీ నెంబర్లతో కాస్త సెంటిమెంట్ ఉన్నా, కేవలం ఆ నెంబర్‌ని ఒకే వ్యక్తికి పేటెంట్‌గా ఇవ్వాలని కోరడం మాత్రం ఆశ్యర్యం కలిగిస్తోంది.