కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, కేవలం స్పెషల్ ప్యాకేజీతోనే సర్దుకుపోవాలని, ప్రత్యేకహోదా వున్నవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఉన్నాయని, ఇక ప్రత్యేకహోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని తేల్చిచెప్పింది. కేంద్రంలోని పార్టీ పెద్దలు, ప్రభుత్వంలోని కేంద్రమంత్రులు అందరూ ఆ విషయాన్ని దాచకుండా కుండ బద్దలు కొట్టారు. దానికి ఏపీలో టిడిపి ప్రభుత్వం కూడా ఓకే అంది. ఇక వైసీపీ మొదట ప్రత్యేకహోదా కావాల్సిందేనని పట్టుబట్టినా తమ నాయకుడు జగన్‌పై ఉన్న కేసులు మాఫీ కావాలంటే మోదీకి శరణన్నడం తప్ప గత్యంతరం లేదని తెలుసుకుని, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా వైసీపీ పార్టీ భేషరత్తు మద్దతుని ప్రకటించింది.
ఇక ప్రత్యేకహోదా కోసం పేరెత్తుతున్నది కేవలం పెద్దగా బలంలేని, రాష్ట్రాన్ని అన్యాయంగా విడదీసిన కాంగ్రెస్. దీని మాట ఎవ్వరూ వినరు. నంద్యాల ఉప ఎన్నికలో, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలలో ఈ విషయం స్పష్టమైంది. ఇక మిగిలింది జనసేన, కమ్యూనిస్ట్‌లే. ఒక పక్క కేంద్రం స్పష్టంగా ప్రత్యేకహోదా అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చెబుతున్నా పవన్ మాత్రం కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని అడగటం తమాషాగా ఉంది.
ఇప్పటికే కేంద్రం స్పష్టతనిచ్చింది. దానికి టిడిపి యస్ అంది. ఇంకా పవన్ కోణంలో స్పష్టత అంటే ఏదో అర్ధంకాని ముడి పదార్థంగా ఉంది. ఎవరు ఏమనుకున్నా పవన్ కేవలం ప్రదాని మోదీ నోటివెంట ప్రత్యేకహోదా ఇవ్వము అని చెప్పించడమే కేంద్రం ఇచ్చే స్పష్టత అనేది అన్యాపదేశంగా తెలుస్తూనే ఉంది. పోనీ వచ్చేసారి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా వచ్చే అవకాశం ఉంది. కానీ ఆ స్థితి, పరిస్థితి కనిపించడంలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా మోదీనే గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. కాలం గడిచే కొద్ది పవన్‌లో ప్రత్యేకహోదా కాంక్ష ఉన్నా అది ప్రజల్లో నీరుగారి పోతుంది.
కాబట్టి ఇప్పటికీ పవన్ తాను అనవసరంగా విమర్శలు చేయను. అనవసరం రాజకీయాలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేయనని చెబుతున్నాడు. అవేమీ లేకుండా ఏపీకి ప్రత్యేకహోదా తెచ్చే సంజీవని పవన్ వద్ద ఏమైనా ఉందా?అనే అనుమానం రాకమానదు. ఇవేమీ లేకుండా ప్రత్యేకహోదా కాదు కదా...! చిన్న విషయాన్ని కూడా సాధించలేం. పవన్ ఇప్పటికైనా ప్రత్యేకహోదా కావాలనుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తరహాలో అందరినీ కలిసి కట్టుకుని ముందుకు ఉద్యమరూపంలో వెళ్లితే తప్ప కుదరని పని అది అని పవన్ తెలుసుకోవాల్సివుంది...!