విభిన్న చిత్రాలను, కొత్తదనాన్ని నమ్ముకునే వారికి ఇన్‌స్టెంట్‌గా సక్సెస్‌లు రాకపోవచ్చుగానీ, కాలం గడిచే కొద్ది వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుందనేది సత్యం. ఆ కోవకి చెందిన నటుడే దగ్గుబాటి రానా. సినిమాలో తన పాత్ర నిడివిని, హీరోయిజాన్ని చూడకుండా వైవిధ్యభరితమైన పాత్ర వస్తే చాలు దానిని చేసి మెప్పిస్తూ వచ్చాడు. చివరకు 'బాహుబలి, ఘాజీ, నేనే రాజు..నేనే మంత్రి' ద్వారా ఆయన తాననుకున్న లక్ష్యాన్ని సాధించాడు. రానా చిత్రం అంటే సమ్‌థింగ్ స్పెషల్ అని, ఓ వర్గం ప్రేక్షకులను ఆయన తనకంటూ తెచ్చుకున్నాడు.
ఇక ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' వంటి భారీ రియాల్టీ షోకి పోటీగా జెమిని చానెల్‌లో 'నెంబర్‌వన్ యారి'తో రికార్డు బద్దలు కొడుతున్నాడు. ఈ షో ఇప్పటికి 9 ఎపిసోడ్స్ పూర్తవ్వగా, ఎన్టీఆర్ 'బిగ్‌బాస్'షో 9 వారాలు ముగించుకుంది. కిందటి వారం మంచు లక్ష్మి-తాప్సి వచ్చిన 'నెంబర్‌వన్ యారి' షోకి 10కి పైగా టీఆర్పీ వస్తే ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' కేవలం 7 పాయింట్లలోపే సాదించింది. ఇలా వెండితెర, బుల్లితెర మీద సంచలనాలు సృష్టిస్తోన్న రానా ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో వెబ్‌సిరీస్ ద్వారా కూడా సంచలనాలు సృష్టించడానికి రెడీ అయ్యాడు.
రానా, నవీన్ కస్తూరియా, ప్రియా బెనర్జీ ప్రధానపాత్రల్లో 'సోషల్' అనే డిజిటల్ షో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్‌ని రానా ట్వట్టర్‌లో పంచుకున్నాడు. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. నా మొదటి డిజిటల్‌షో, థ్రిల్లర్ ట్రైలర్ అని రానా ట్వీట్ చేశాడు. సోషల్ మీడియా ప్రభావం రోజు రోజుకి పెరిగిపోతోంది. సైబర్ క్రైంల వల్ల ఏటా లక్షలాది మంది ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. డేటా, గుర్తింపును కొందరు తస్కరిస్తున్నారు. బ్యాంకు మోసాలు, సెక్స్ క్రైంలు పెరిగిపోతున్నాయి. ఒక్క క్లిక్ వల్ల మీ జీవితం నాశనం అవుతుంది... అని ట్రైలర్‌లో మొదట చూపించారు.
నిజమైన కథల ఆధారంగా ఈ షోని తెరకెక్కిస్తున్నట్లు ఈ షో బృందం తెలిపింది. ఇందులో రానా ప్రపంచంలోనే సెన్సేషనల్ టెక్ కంపెనీగా పేరొందిన 'సోషల్' అనే కంపెనీ సీఈవో విక్రమ్ సంపత్ పాత్రలో కనిపించనున్నాడు. త్వరలో ఈ షో ప్రారంభం కానుంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ షో ప్రసారం కానుంది.