నేడు గురుపూజోత్సవం సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, ఒలింపిక్, ప్రపంచ చాంపియన్ షిప్ రజత పతక విజేత పి.వి.సింధు తన గురువు పుల్లెల గోపీచంద్‌కి మరిచిపోలేని కానుకను ఇచ్చింది. టీచర్స్ డే సందర్భంగా ఆమె 'ఐ హేట్ మై టీచర్' అనే డిజిటల్ ఫిల్మ్‌ని రూపొందించిన గురుదక్షిణ అందించింది. గురు పూజోత్సవం సందర్భంగా తన విజయాలను తన గురువు పుల్లెల గోపీచంద్‌కి అంకితమిస్తున్నట్లు ఆమె పేర్కొంది.
శిక్షణలో కోచ్‌లు ఎంత కఠినంగా ఉన్నా.. అదంతా ఆటగాళ్ల భవిష్యత్తు కోసమే చేస్తారనే కథాంశంతో ఆమె ఈ 'ఐ హేట్ మై టీచర్'ని రూపొందించింది. ఇందులో సింధుతో పాటు ఆమె గురువు పుల్లెల గోపీచంద్ కూడా నటించారు. కోచ్‌లు తమ శిష్యుల కోసం ఎంతో కష్టపడతారు. టీచర్స్ డే సందర్భంగా నా విజయాలన్నింటిని నా గురువుకు అంకితమిస్తున్నాను. మనల్ని ముందుండి నడిపే వారికే మనం సాధించిన ఘనతలన్ని చెందుతాయని ఈ సందర్భంగా సింధు తెలిపింది.