మొన్నామధ్యన డ్రగ్స్ కేసులో 11 మంది సినీ సెలబ్రిటీస్ కి నోటీసులు ఇచ్చి మరీ విచారణ చేపట్టిన సిట్ అధికారులు సెప్టెంబర్ లో మరికొంతమందికి నోటీసులు ఇస్తామని చెప్పారు. కానీ అప్పటినుండి మళ్ళీ ఇప్పటివరకు ఆ కేసుకు సంబంధించిన ఒక్క విషయం కూడా బయటికి రాలేదు. అప్పుడేమో సినిమా స్టయిల్లో సినిమా వాళ్ళని విచారణకు పిలిచి హంగామా చేసిన అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు మీడియాలో తెగ హైలెట్ అయ్యారు. ఇక చిన్న చేపలను పట్టుకుని పెద్ద చేపల్ని వదిలేస్తున్నారని అప్పటినుండి ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తుంది. అయితే మధ్యలో ఒక నెల గ్యాప్ ఇచ్చి సెప్టెంబర్ లో పార్ట్ 2 ఉండబోతుందంటూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే సినీ పెద్దల రాయబారంతో ఈ డ్రగ్స్ కేసు మళ్ళీ సినిమా ఇండస్ట్రీని ఫోకస్ చేయదనే అనుకుంటున్న సమయంలో ఇపుడు మరోమారు డ్రగ్స్ వ్యవహారం తెరమీదకొచ్చింది.
అయితే ఇప్పుడు తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో మరో నలుగురు సినీ సెలబ్రిటీస్ కి నోటీసులు అందించబోతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఈ కేసుని సిట్ అధికారులు పక్కన పెట్టలేదని... వారు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని లోతుగా శోధిస్తున్నారనే టాక్ వినబడుతుంది. ఆ 11 మంది సినిమా సెలబ్రిటీస్ చెప్పిన సమాచారంతో ఆధారాలు సేకరించిన సిట్ అధికారులు మరో నలుగురు సినీ నటులకు కూడా నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక ఈ నలుగురిలో ఒక ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు. అయితే తాజాగా నోటీసులు ఇవ్వాలనుకుంటున్న హీరోయిన్ ను.. మిగిలిన ముగ్గురు సినీ నటులను రహస్యంగా విచారించాలా? లేకపోతే అందరి మాదిరే నోటీసులు ఇచ్చి విచారించాలా? అన్నది సిట్ అధికారులు ఇంకా తేల్చుకోలేదని చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయం బహిర్గతమవుతుంది అంటున్నారు.
ఈ డ్రగ్స్ కేసులో ఒక హీరోయిన్.... మరో ముగ్గురు సినీ పెద్దల ఫ్యామిలీలకు చెందినవాళ్లు వున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. అయితే వీళ్లు ఒక పార్టీలో డ్రగ్స్ తీసుకుంటుండగా అందుకు సంబంధించిన ఆధారాలు వీడియోలతో సహా సిట్ అధికారులకు చిక్కినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి. అలాగే ఈ బడా హీరోయిన్ సినిమాకి సంబందించిన ఒక ఫంక్షన్ లో బహిరంగంగానే తన వెంట డ్రగ్స్ తీసుకురావడమే కాక... ఆమె అక్కడే డ్రగ్స్ తీసుకున్నట్టుగా చెబుతున్నారు. ఇక ఆమెకు డ్రగ్స్ మత్తు బాగా ఎక్కడంతో కింద పడిపోవడంతో ఆమె సహా నటుడు ఒకరు ఆమెను తన కారులో ఇంటికి తీసుకెళ్లి ఇంటిదగ్గర దింపినట్టుగా ఒక ప్రముఖ దిన పత్రిక కథనాలు ప్రచురించింది. ఇక దీంతో ఆ నలుగురు నటీనటులు ఎవరంటూ ఎవరికీ వారు ఊహాగానాలు స్టార్ట్ చేసేశారు. మరి మళ్ళీ ఈ డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరగనుందో? చూద్దాం.