ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, వామపక్ష భావజాలం కలిగి, కమ్యూనిస్ట్ ఉద్యమాలలో పాల్గొని, ఇటీవల గోవధకు వ్యతిరేకంగా బీఫ్ ఫెస్టివల్‌ని నిర్వహించిన గౌరీ లంకేష్ దారుణ హత్య ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈమె మరణం పట్ల కర్ణాటక సీఎం సిద్దరామయ్య తీవ్ర ఆందోళన, సానుభూతి వ్యక్తం చేశాడు. ఆమె హత్య తనని కలచివేసిందని ఆయన వ్యాఖ్యానించాడు. ఆమె మృతికి కారణమైన వారిని చట్టం ముందు నిలబెడతామని ఉద్ఘాటించాడు. గౌరీలంకేష్‌తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందని, పాత్రికేయురాలిగా ఆమె రాణించిన తీరు ఎంతో ఆదర్శనీయమన్నారు.
విపక్షాలు డిమాండ్ చేసినట్లు ఆమె మృతిపై సిబిఐ విచారణ అవసరం లేదని, రాష్ట్ర పోలీసులపై తనకు ఎంతో నమ్మకం ఉందని ఆయన నొక్కి వక్కాణించారు. ఐజీ స్థాయి అధికారితో కూడిన ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవస్థీకృత నేరాలను అడ్డుకట్ట వేసేందుకు కట్టుబడి ఉన్నామని సిద్దరామయ్య మరోసారి స్పష్టం చేశారు. మొత్తానికి గౌరీ లోకేష్ హత్యదేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ దేశంలో పెరిగిపోతున్న హత్యాకాండకు, మారుతున్న నేర ప్రవృత్తికి ఈ హత్య ఓ ఉదాహరణగా ఆమె తన ప్రకటనలో తెలిపారు.