నేడు ప్రపంచంలోని దేశాల మద్యనే కాదు.. దేశంలోని రాష్ట్రాల మధ్య కూడా ప్రాంతీయ వాదాలు బుసలు కొడుతున్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చి తమవారి ఉద్యోగాలను ఇతరులు దోచుకోవడంపై అమెరికాతో పాటు పలు దేశాలలో దాడులు, విద్వేషాగ్నులు రగులుతున్నాయి. ఇక తెలంగాణ ఉద్యోగాలు తెలంగాణ యువతకే, మహారాష్ట్రలో ఇతరులు ఎవ్వరూ ఉద్యోగాలు చేయరాదు.. అనే ప్రాంతీయ విద్వేషాలు భగ్గుమని అది దాదాపు తెగేదాకా పరిణామాలు దారితీశాయి. ఇక దక్షిణాది రాష్ట్రాలలో కన్నడిగులది ఓ ప్రత్యేక శైలి.
అందరిని తమలో కలుపుకున్నట్లే ఉన్నప్పటికీ దిగువ రాష్ట్రాలకు నీటిని విడుదల చేయడం నుంచి, ప్రాజెక్ట్‌ల ఎత్తుని తమకిష్టం వచ్చినట్లు పెంచుకోవడంలో, చివరకు డబ్బింగ్ చిత్రాల విషయంలో కూడా వీరి పంధాని చూస్తే కన్నడిగులకు కాస్త ఎక్కువనే చెప్పవచ్చు. ముఖ్యంగా రాజకీయపరంగా చూసుకున్నా కూడా కేంద్రంలో ఉండే బిజెపి, కాంగ్రెస్‌లకు రెండు తెలుగు రాష్ట్రాల కన్నా కర్ణాటక అత్యంత కీలకం. దాంతో కన్నడిగులు ఎన్ని వెర్రితలలు వేస్తున్నా కేంద్రాలు చూసి చూడనట్లే ఉంటాయి. ఆల్మట్టి నుంచి అన్నింటిలోనూ కేంద్రాలది కన్నడిగుల విషయంలో నాన్చుడు ధోరణే.
తాజాగా విషయానికి వస్తే ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బి, కన్నడ రీజనల్ రూరల్ బ్యాంకుల ఉద్యోగాలకు పరీక్ష రాయటానికి వచ్చిన తెలుగువారిని కన్నడిగులు అడ్డుకున్నారు. తమ ఉద్యోగాలను తెలుగువారు లాక్కెళ్లిపోతున్నారని నినాదాలు చేస్తూ పరీక్ష రాయడానికి వచ్చిన తెలుగువారిపై వీరంగం సృష్టించారు. వాస్తవానికి ఈ పరీక్షలను దేశంలోని ఎవరైనా రాసి ఉద్యోగాలు సంపాదించవచ్చు. తెలుగు రాష్ట్రాలలోని ఇలాంటి ఉద్యోగాలను పలువురు గతంలో కన్నడిగులు సొంతం చేసుకున్నారు కూడా. కానీ తమ వరకు వచ్చే సరికి మాత్రం కన్నడిగులు తమ ఉద్యోగాలు తమకే ఇవ్వాలని, ఇతరులు పరీక్షలు రాయకూడదని జులుం చేసి అడ్డుకున్నారు.
హుబ్లీ, గుల్బర్గా, దావణగారె, బెంగుళూరులలో వీరు ఆందోళనలకు దిగారు. రైల్వే స్టేష్టన్లు, బస్టాండ్‌ల ఎదుట తెలుగువారిని అడ్డుకుని కర్రలతో దాడి చేశారు. తెలుగు వారిని దిగ్బంధించారు. కన్నడ గ్రామీణ బ్యాంకులకు పరీక్షలు రాసే తెలుగువారిని చంపేస్తామని హెచ్చరించారు. నంద్యాలలో ఈ పరీక్షల కోసం తెలుగు వారితో పాటు కన్నడిగులు కూడా కోచింగ్‌లు తీసుకున్నారు. దీంతో అక్కడ కోచింగ్ తీసుకున్న కన్నడిగులు ముందుగానే ఈ పరీక్షలకు హాజరయ్యే తెలుగువారి వివరాలను కన్నడసంఘాలకు అందజేశారు. లాడ్జీలు, ఆటోలను తెలుగువారిని ఎక్కించుకోవడానికి, దిగడానికి వీలులేదని ముందుగానే హెచ్చరికలు చేశారు. దీంతో ఎంతో కాలంగా ఈ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న తెలుగువారు తీవ్ర నిరాశ చెందారు.