నాడు టి.రాజేందర్ తమిళ చిత్రాల డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఆయన తమిళంలో ఏమాత్రం హీరో లక్షణాలు లేనప్పటికీ హీరోగా చేసి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే పనిలో పనిగా బాలనటునిగా తన కుమారుడు శింబుని కూడా వెండితెరకు పరిచయం చేశాడు. రాజేందర్ ఆరోజుల్లోనే తన చిత్రాలకు తానే నిర్మాత, దర్శకుడు, హీరో, మాటలు, పాటలు ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించేవాడు. ఆయన కొడుకు కూడా అదే దారిలో పయనించాడు.
కానీ శింబుకి తమిళంలో నటునిగా కంటే వ్యక్తిగత వ్యవహారాలలోనే ఎక్కువ గుర్తింపు ఉంది. దాంతో ఆయన చిన్ననాటే రజనీకాంత్ వంటి వాడిని పోటీ చేస్తూ తనను తానే లిటిల్ సూపర్‌స్టార్ అనే బిరుదుని తగలించుకున్నాడు. ఆయన వ్యవహారం చూసిన వారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఉందని సెటైర్లు వేశారు. ఇక ఈయన కూడా అటు గాయకునిగా కూడా ఈమద్య అనిరుధ్ చిత్రంలో బీప్‌సాంగ్ పాడి మహిళలను కించపరిచాడు. నటునిగా దృష్టి పెట్టకుండా ప్లేబోయ్ వ్యవహారాలతో నయనతార, హన్సికలతో పాటు పలువురితో ఎఫైర్లు పెట్టుకోవడమే కాదు.. తాను వారితో ఉన్న పర్సనల్ ఫోటోలను లీక్ చేసి వారి గుట్టును బజారుకీడ్చాడు. దాంతో ఆయనంటే అందరూ లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఇక మహిళా ప్రేక్షకులు ఆయనంటే మండిపడే పరిస్థితి ఏర్పడింది. ఇలా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకున్న స్వయంకృతాపరాధం ఆయనది.
తాజాగా శింబుకి ఇంతకాలానికి పెళ్లి చేయాలని ఆయన తండ్రి రాజేంద్రన్ నిర్ణయించాడు. ఆయన రీసెంట్ గా తిరుమల వెంకటేశ్వరస్వామిని సందర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, శింబుకి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని, ఆయనకు మంచి పెళ్లికూతురు చిక్కాలని ఆ దేవుడిని కోరుకున్నట్లు చెప్పాడు. తన కుమారుడు శింబు, నయనతారతో కలిసి నటించిన 'సరసుడు' చిత్రం ఈనెల 15న విడుదల కానుందని, తనను ఆదరించినట్లే తన కుమారుడి కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని మనవి చేశాడు. 'సరసుడు' చిత్రానికి తానే మాటలు, పాటలు రాశానని తెలిపాడు.
జయ మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయని, ప్రతి ఒక్కరు సీఎం కావాలని కోరుకోవడం మంచిది కాదని, జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు వీరంతా ఎందుకు ఆమెను పరామర్శించలేదని కొత్త సమస్యను తట్టిలేపాడు. తాను స్థాపించిన లక్ష్మా ద్రవిడ మున్నేట కజగం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతోందని చెప్పాడు. మిగిలిన విషయాలు ఎలా ఉన్నా శింబుతో కలిసి నటించాలంటేనే భయపడిపోతున్న హీరోయిన్లకు తన కుమారుడి విరగడ చేయడం ఆయన ముందున్న తక్షణ కర్తవ్యంగా చెప్పాలి.