జనసేన సిద్దాంతాలను పవన్ కేవలం తన 'పవనిజం' పుస్తకం ద్వారానే ప్రచురించాడు. అది కూడా జనసేన సిద్దాంతం కాదు.. అది కేవలం పవన్ సిద్దాంతాలను మాత్రమే వివరించింది. ఇక ఈ 'పవనిజం' పుస్తకం కొందరికి బాగా అర్ధమైందని చెబుతున్నారు కానీ అది కాస్త గందరగోళంగా, పవన్ అబిప్రాయాలను, మనోభావాలను ఆవిష్కరించడంలో, సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా ఆ సిద్దాంతాలను, భావాలను వ్యక్తీకరించడంలో మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈ పుస్తకం తమకు అర్ధం కాలేదని, ఇందులోని భావాలను సరిగా వ్యక్తీకరించలేదని ఎవరైనా అంటే వారిని తెలివి తక్కువ వ్యక్తి కింద లెక్కగడుతారనో లేక పవన్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనో అందరూ ఆ పవనిజం అంటే మాకర్దమైందంటే.. మాకర్దమైందంటూ చెబుతున్నారు. కానీ పవన్ మరోసారి తాను కాకుండా మరొకరి చేత పవనిజం గురించి రాయించాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది.
ఇక ఈ మధ్య అది ఏ సినిమా వేడుక అయినా, అది ఏ ఇంటర్వ్యూలో అయినా అందునా పవన్ నామస్మరణ మామూలైపోయింది. ఇక కొత్తగా పైకి వస్తున్న వారు కూడా తమ స్వార్దం కోసమో, లేక తమ ఫాలోయింగ్‌ని పెంచుకోవడం కోసమో మంచికో చెడుకో దేనికైనా సరే పవన్‌ని టార్గెట్ చేస్తున్నారు. పవన్‌ని విమర్శించడం లేదా పవన్ అంటే తమకిష్టం అని చెప్పడం ద్వారా వారు సెలబ్రిటీ హోదాలను పెంచుకోవాలని చూస్తున్నారు. కత్తి మహేష్ వంటి వారు పవన్‌ని వ్యతిరేకిండం ద్వారా సెలబ్రిటీ హోదా పొందాలని చూస్తుంటే, 'అర్జున్‌రెడ్డి' దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తాను పవన్ అభిమానినని చెబుతున్నాడు.
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఓ అభిమాని మీరు పవన్ అభిమానినని చెబుతున్నారు కదా...! మీ నుంచి పొలిటికల్ ఫిల్మ్ ఆశించవచ్చా? జనసేన గురించి మీ అభిప్రాయం ఏమిటి? అని అడిగాడు. దానికి సందీప్‌రెడ్డి మాట్లాడుతూ, 'జనసేన' అనేది పవర్‌ఫుల్ ఐడియా....పవన్ స్పీచ్‌లు, జనసేన అనే టైటిల్ ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయని చెప్పాడు. ఇదేదో సినిమా టైటిల్‌లాగా ఈ టైటిల్ అంటే తనకెంతో ఇష్టమని, దానికి ఓ వెయిట్ ఉందన్నాడు. తాను చిరంజీవి, పవన్‌కళ్యాణ్‌లకి బిగ్‌ఫ్యాన్‌నని తెలిపాడు. తన గురించి కాస్త ఐడియా ఉన్నవారికి కూడా ఆ విషయం తెలుసునని, మన దగ్గర సినిమా, పాలిటిక్స్, స్పోర్ట్స్ అనే వాటి గురించి ఎక్కువగా మాట్లాడుతారని, వీటిపై ప్రజలకు నాలెడ్జ్ ఉందన్నాడు.
ఎప్పుడనేది చెప్పలేను గానీ ఖచ్చితంగా పొలిటికల్ స్టోరీ మాత్రం రాస్తానన్నాడు. అయినా ఓ పార్టీ టైటిల్‌ను చూసి పవర్‌ఫుల్ అని చెప్పడం చూస్తే నవ్వురాక మానదు. టైటిల్ అనేది సినిమాలకి ఉపయోగం ఏమో తెలియదుగానీ ఓ రాజకీయ పార్టీ పేరు పవర్‌ఫుల్‌గా ఉందని, అందుకే దానిని అభిమానిస్తున్నానని చెప్పిన మొదటి వ్యక్తిగా సందీప్‌రెడ్డిని చరిత్రలో లిఖించవచ్చు.