'బాహుబలి-ది బిగినింగ్, బాహుబలి- ది కన్‌క్లూజన్'ల తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే చిత్రం ఎవరితో అనే సందేహాలు అందరినీ ఊరిస్తున్నాయి. ఆయన మహేష్ బాబుతో చేస్తాడని, కాదు.. కాదు.. మరలా ప్రభాస్‌తోనే చేస్తాడని, కాదు.. దానయ్య నిర్మాతగా అల్లు అర్జున్‌తో చిత్రం ఉంటుందని పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో చిరంజీవి హీరోగా చారిత్రక కథాంశంతో రూపొందనున్న 'సై..రా... నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ ఆవిష్కరణకు ముఖ్యఅతిధిగా రాజమౌళి హాజరుకావడం, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న 'రంగస్థలం 1985' తర్వాత రామ్ చరణ్ నటించే చిత్రం ఏమిటి? అనేది ఇంకా నిర్ణయం కాకపోవడంతో రాజమౌళి తర్వాతి చిత్రం రామ్ చరణ్‌తోనే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజమౌళి తండ్రి,రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న 'శ్రీ వల్లీ' చిత్రం ప్రీరిలీజ్ వేడుకగా ఈ రోజు సాయంత్రం జరుగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్‌కి రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నాడు.
ఇలాంటి పరిణమాలను గమనిస్తూన్న ఫిల్మ్‌నగర్ వర్గాలు 'మగధీర' తర్వాత వచ్చే సంక్రాంతి నుంచి రాజమౌళి- రామ్ చరణ్‌ల కాంబినేషన్‌లోనే రాజమౌళి తదుపరి చిత్రం ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. మరి ఇదే నిజమైతే మాత్రం ఈ వార్త మెగాభిమానులకు తీయని వార్తగానే చెప్పవచ్చు.