మెగాబ్రదర్స్ ముగ్గురిలో నాగబాబుది ప్రత్యేకశైలి. ఆయన కేవలం తమ ఫ్యామిలీ హీరోలనే కాదు... తనకు నచ్చిన ఇతర స్టార్స్ గురించి కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా తన భావనలను తెలియజేస్తూ ఉంటాడు. ఇటీవలే ఆయన సూపర్‌స్టార్ మహేష్ బాబు రన్నింగ్ గురించి, ఆయన చేసే హార్డ్ వర్క్‌ని గురించి ఎంతగానో మెచ్చుకున్నాడు. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోలు ఇతర హీరోలపై అభిమానమున్నప్పటికీ మనసులోనే ఉంచుకుంటారు గానీ పొగడడం, విమర్శించడం రెండూ చేయరు.
వారి ఫ్యామిలీలోనే మెగా స్టార్ చిరంజీవి, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష వంటి బోలెడు మంది హీరోలు ఉన్నారు. వారిని కాదని మెగా బ్రదర్ నాగబాబు తాజాగా తనకు నచ్చిన ఇతర స్టార్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర స్టార్స్‌లో తనకు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్‌లు ఎంతో ఇష్టమని ఆయన చెప్పాడు. హీరోలుగా వారు ఈ స్థాయిలో ఉండటానికి ఎంతో శ్రమించారని, ఆ విషయం తనకు తెలుసునని వ్యాఖ్యానించాడు. అభిమానులను అల్లరించడం కోసం ప్రతిక్షణం వారు పడే తపన, కష్టం, వారు చేసే కఠిన సాధనలే వారిని ఈ స్థాయికి తీసుకుని వచ్చాయని తెలిపారు.
మెగాఫ్యామిలీ హీరోలైనా, ఇతర హీరోలైనా వారి హార్డ్‌వర్క్‌తో వారు నిలబడ్డారని, వారిలో ఆ వర్త్ ఉండబట్టే లక్షలాది మంది అభిమానాన్ని పొందుతున్నారని, నిర్మాతలు వారిపై కోట్లు నమ్మకం ఉంచి పెట్టుబడులు పెడుతున్నారని ఆయన విశ్లేషించారు. ఎవరినైనా విమర్శించడం సులభమేనని, కానీ వారి టాలెంట్‌ని గుర్తించడం మాత్రం ఎంతో కష్టమని ఆయన సూత్రీకరించారు. మొత్తానికి నాగబాబు మరోసారి తనదైన పంధాలో ఏమాత్రం దాపరికం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలకు ఎనలేని ప్రాముఖ్యత ఏర్పడిందనే చెప్పాలి.