సినిమా ఇండస్ట్రీలో నటీనటులు ఎంతో జాగరూకతతో ఉండాలి. లేకపోతే వచ్చే చాన్స్‌లు కూడా దక్కకుండా పోతాయి. ఫలానా కమెడియన్లను మన సినిమా కోసం తీసుకుందామని దర్శకనిర్మాతలు, హీరోలు నిర్ణయించిన తర్వాత కూడా వారు ఎందుకండీ.. అంతకంటే తక్కువగా చేసే వారు ఉండగా. వారికి అంతంత రెమ్యూనరేషన్ ఇచ్చి పెట్టుకోవడం ఎందుకు? మనకు అందుబాటులో, తక్కువ రెమ్యూనరేషన్లకే పనిచేసే వారు ఉన్నారు.. అని వచ్చిన అవకాశాలను దారి మరలించే వారు ఎందరో ఉంటారు. ఇలా కొందరు నటీనటులు, చివరకు హీరోలు చేయాల్సిన పాత్రలను కూడా వేరే వారు తన్నుకుపోయే సంఘటనలు ఇక్కడ కోకొల్లలుగా కనిపిస్తాయి.
ఒక నటుడిని పెట్టుకోవాలని నిర్ణయించిన తర్వాత మరోకరు ఆ పాత్ర కోసం ప్రయత్నించడం.. కావాలని తమ రెమ్యూనరేషన్‌ని తగ్గించి ఆయా పాత్రలను తమకు వచ్చేలా చేసుకోవడంలో వెన్నుపోటు తత్వం కనిపిస్తుంది. అది హెల్తీ కాంపిటీషన్ అనిపించుకోదు. రేపు మరో సినిమా విషయంలో తమకు కూడా అలాగే జరగదని నమ్మకం ఏమిటి? అనే కనీసం జ్ఞానం ఇలా ప్రవర్తించే వారిలో కనిపించదు. నటనాపరంగా ఫలానా వాడికంటే తాను బాగా చేయాలని కోరుకోవాలే గానీ రెమ్యూనరేషన్ తగ్గించో, మరో విధంగానో మరోకరి పాత్రను హైజాక్ చేసే సంఘటనలు వింటుంటే నటీనటులకు తోటి నటీనటులే విలన్లు అని చెప్పకతప్పదు.
వారికి శత్రువులు బయట ఉండరని, వారిలోనే ఉంటారని చెప్పవచ్చు. ఇక కమెడియన్లలో చిన్నతనం నుంచి సినీ ఫీల్డ్‌లోనే ఉండి పెద్దయిన తర్వాత కూడా బిజీ కమెడియన్‌గా సాగుతున్న అలీ ఒకరు. ఇక అసిస్టెంట్ రైటర్‌గా ఇండస్ట్రీకి వచ్చి, రచయితగా, దర్శకునిగా మారి.. తనదైన డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్‌తో నటునిగా మారి, 'నాయక్, టెంపర్' చిత్రాలతో తనదైన నటనతో కమెడియన్‌గా బాగా బిజీ అయిన పోసాని కృష్ణ మురళి ఇంకొకరు. ఎప్పుడు ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే పోసాని కృష్ణమురళి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనానికి, ఎంతో చర్చకు దారితీస్తోంది.
ఎప్పుడు నవ్వుతూ ఉండే అలీ ఒకసారి తన వద్దకు ఏడుస్తూ వచ్చాడని, ఎందుకు ఏడుస్తున్నావు? అని అడిగితే ఓ సినిమాలో మన ఇద్దరిని పెట్టుకున్నారు. కానీ వారికి అంత ఇవ్వడం దేనికి? అంతకంటే తక్కువకు వారు చేస్తారు కదా...! అని దర్శకనిర్మాతలకు చెప్పి తమ ఇద్దరినీ సినిమా నుంచి తీసివేయించారని అలీ బాధపడ్డాడట...! పరిశ్రమలో ఎంతో అనుభవం, పరిచయాలు ఉన్న అలీ, పోసాని వంటి వారి పరిస్థితే ఇలా ఉంటే ఇక అప్‌కమింగ్ ఆర్టిస్టుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. మరి ఆ సినిమా ఏమిటి? అలా చేసిన వారు ఎవరు? అనేది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.