కొందరు సంగీతం అందించే చిత్రాలలోని పాటలను చూస్తుంటే ఆ పాటలు చూడకపోయిన ఫర్వాలేదు.. విసుగుపుట్టిస్తున్నాయని భావించి ప్రేక్షకులు బాత్రూంలకు పోతుంటారు. సినిమాలో వచ్చే ఒకే ఇంటర్వెల్‌తో పాటు ఈ పాటలు వచ్చే వాటిని కూడా వీక్షకులు కేవలం బాత్రూం పాటలుగా, ఇంటర్వెల్ పాటలుగా భావిస్తారు. ఇంకొందరు పాప్‌కార్న్ వంటి వాటిని తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు సినిమా థియేటర్లలో ఒప్పుకోవడం లేదు కానీ ఒకప్పుడు కొన్ని సినిమాల పాటలు వచ్చినప్పుడు ప్రేక్షకులు బీడీలు, సిగరెట్లు తాగడానికి వెళ్లేవారు. కానీ కొందరు సంగీత దర్శకులు అందించే పాటలు, వాటి ట్యూన్స్, వాటిని విజువల్‌గా చూపించే దర్శకుల వండర్స్‌ని చూస్తే ప్రేక్షకులు పాటలు వచ్చేటప్పుడు కూడా కుర్చీలకే అంటుకుపోయి, కుర్చీ ఎడ్జ్‌ల నుంచి చూస్తూ ఆహ్వానిస్తారు.
పాతకాలం నాటి సంగీత దర్శకులతో పాటు ఇటీవలి కాలంలో అలా తమ పాటలు, ఆర్.ఆర్‌తో కూడా ప్రేక్షకులను సమ్మోహనపరిచిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్, దేవిశ్రీప్రసాద్, కీరవాణి వంటి వారిని చెప్పవచ్చు. ఇక తన కెరీర్ ప్రారంభంలో నానా కష్టాలు పడి చివరకు కీబోర్డ్ ప్లేయర్‌గా ఇళయరాజా, కోటి.. వంటి ఎందరి వద్దనో పనిచేసి సంగీత దర్శకుడయ్యాడు సంగీత మాంత్రికుడు ఏఆర్‌రెహ్మాన్. ఆయన దక్షిణాది సంగీతాన్ని దేశ, విదేశాల స్థాయికి తీసుకెళ్లి ఆస్కార్ వద్ద నిలుచోబెట్టాడు. ఈయనకు ఒకే విధమైన సంగీతం కాకుండా విభిన్నమైన చాలెంజ్‌లను స్వీకరించడం అంటే ఎంతో ఇష్టమంటున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా, కంపోజర్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న రెహ్మాన్ తొలిసారి తన కాన్సెర్ట్ టూర్లతో చిన్న డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు నా వయసు 50ఏళ్లు, పెద్ద వాడినైపోయాను. నాకు కమర్షియల్ చిత్రాలు చేయాలనుంది. ప్రేక్షకులు బాత్రూంలకు, పాప్‌కార్న్‌లను కొనుక్కోవడానికి కూడా వెళ్లలేనంత గొప్పగా సంగీతాన్ని ఆవిష్కరించాలని అనుకుంటున్నాను. నా జీవితంలో ఉన్న ఆశ అదొక్కటే.. అంటున్నాడు.