దర్శకధీరుడు రాజమౌళి చిత్రాలలో సగం భాగస్వామ్యం ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌కి దక్కుతుంది. ఆయన తన కుమారుడికి అందించే కథలు అలాంటివి. ఏదైన చిత్రం విజయం సాధించాలంటే కథ నుంచే పుడుతుంది. మంచి కథ, బలమైన కంటెంట్ ఉంటేనే చిత్ర విజయాలు సాధ్యమవుతాయి. కథలేకుండా 'బాహుబలి' అయినా, 'భజరంగీ భాయిజాన్' అయినా కేవలం గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్, భారీ బడ్జెట్‌లతోనే విజయం సాధించలేవు. సరైన కథ లేకపోతే ఇవ్వన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇక కథలు అనేవి రచయితల ఊహ నుంచి ఆవిర్భవిస్తాయి. అలాగే సమాజంలో, తమ జీవితంలో జరిగే నిజజీవిత సంఘటనల ఆధారంగా కథలు పురుడు పోసుకుంటాయి. మరి అంత బలమైన కథకు తగినంత విజువల్ సెన్స్ దర్శకునికి ఉంటే మాత్రం చిత్రం విజయం సాధించడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
ఇక తాజాగా రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తానే కథను రాసుకుని దర్శకత్వం వహించిన చిత్రం 'శ్రీవల్లీ' ఈ నెల 15వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాజమౌళికి 'మహాభారతం' అనేది ఓ కల. ఆయనకు యుద్దాలంటే చాలా ఇష్టం. ఆయన 'మహాభారతం' తీయాలని ఎప్పటినుంచో భావిస్తున్నా.. అది జరిగే పనా? అని భావించాను. కానీ 'బాహుబలి' చిత్రం తర్వాత మాత్రం ఆయన తీయగలడనే నమ్మకం ఏర్పడింది. అందుకే ఆ విషయం అప్పుడు చెప్పని నేను ఇప్పుడు ఆ విషయాన్ని బలంగా చెబుతున్నాను. ఇక 'శ్రీవల్లి' చిత్రం విషయానికి వస్తే ఇది కూడా పునర్జన్మల కథాంశంతో రూపొందిన చిత్రం. నాకు రమేష్ అనే స్నేహితుడు వైజాగ్‌లో ఉన్నాడు. 2010 వినాయక చవితి ముందురోజు నాకు ఆ ఫ్రెండ్‌ని చూడాలని ఎంతో గట్టిగా అనిపించింది. ఆయనను కలవాలని ఎంతగానో ఆలోచనలు వచ్చాయి. అది జరిగిన రెండేళ్ల తర్వాత నేను వైజాగ్‌కి వెళ్లి, వాళ్లింటికి వెళ్లాను. కానీ ఆయన 2010 వినాయకచవితి ముందురోజే మరణించాడని, ఆయన కూడా చనిపోయే ముందు నన్ను చూడాలని ఎంతగానో పరితపించాడని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు.
అంటే ఆయన నా గురించి ఆలోచించిన రోజునే నేను కూడా ఆయన గురించి ఆలోచించి, ఆయన్ను చూడాలని కోరుకున్నాను. ఇలా ఒక మనసు నుంచి వచ్చే తరంగాలు, మరో మనసుని చేరడం మీదనే 'శ్రీవల్లి' చిత్ర కథ ఆధారపడి నడుస్తుంది. ఈ పాయింట్‌తో ఓ చెడ్డమనసు కలిగిన వ్యక్తిని కూడా మన మనసుల ఆలోచనలతో మంచి వాడిని చేసే కాన్సెప్ట్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది.. అంటూ విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు.