గతంలో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితంపై ఓ బయోపిక్ తీస్తానని, ఆ చిత్రాన్ని ఎక్కడ మొదలుపెట్టాలి.. ఎక్కడ ముగించాలో కూడా తనకు తెలుసునని అన్నాడు. దాంతో ఈ చిత్రం ఎన్టీఆర్ పుట్టుక నుంచి నటునిగా మారడం, ముఖ్యమంత్రి కావడం వరకు చూపించి ముగించేసే ఉద్దేశ్యం బాలయ్య మాటల ద్వారా అర్ధమైంది. దానికి పూరీజగన్నాథ్ లేదా రాంగోపాల్‌వర్మ, తేజ వంటి దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌ని తీస్తే తనకు గానీ, తన ప్రియ శిష్యుడు పూరీకి గానీ ఇవ్వాలని వర్మ భావిస్తున్నాడు. కానీ ఇది వర్కౌట్ అయ్యే సీన్ కనిపించకపోవడంతో ఆయన ఓ రకంగా బాలయ్యని ఇన్‌డైరెక్ట్‌గా బెదిరిస్తున్నాడు.
తాను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే చిత్రాన్ని తీస్తానని, ఇందులో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత నందమూరి కుటుంబంలో చెలరేగిన వివాదాలు, ఎన్టీఆర్‌పై తిరుగుబాటు, వైస్రాయ్ హోటల్‌లో ఆయనపై చెప్పులు వేయడం, తన పిల్లల పట్ల ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చేసిన హాట్ కామెంట్స్, అల్లుడి వెన్నుపోటు గురించి మాట్లాడిన ఇంటర్వ్యూలలోని సారాన్ని, లక్ష్మీపార్వతి వెర్షన్‌ని తీసుకుని ఈ ఎన్టీఆర్ బయోపిక్‌ని లక్ష్మీపార్వతికి అనుకూలంగా, ఆమెను హైలైట్ చేస్తూ నందమూరి బాలకృష్ణతో పాటు చంద్రబాబు నాయుడు, మిగిలిన ఎన్టీఆర్ కుటుంబసభ్యుల వెర్షన్‌ని కాకుండా లక్ష్మీపార్వతి విషయంలో ఏమి జరిగింది? అనే కనుమరుగైన విషయాలను, ఎన్టీఆర్‌కి లక్ష్మీపార్వతి మినహా అందరు చేసిన ద్రోహాన్ని చూపించి, మరలా ఏ పాత విషయాలనైతే నందమూరి బాలకృష్ణ, చంద్రబాబునాయుడు దాచిపెట్టాలని, ఆ అంశాలు మరోసారి తెరపైకి చర్చకు రాకుండా చేయాలని భావిస్తున్న విషయాలనే వర్మ తన చిత్రం ద్వారా హైలైట్ చేయనున్నాడు.
గతంలో ఆయన పరిటాల రవి సినిమా 'రక్త చరిత్ర','వంగవీటి'ల లాగానే ఇది లక్ష్మీపార్వతికి అనుకూలంగా తీయాలని కసరత్తు చేస్తున్నాడు. తాజాగా లక్ష్మీపార్వతి కూడా తన వద్దకు వర్మ పంపిన వ్యక్తులు వచ్చి తన వెర్షన్‌ని తీయాలని భావిస్తున్నట్లు చెప్పారని, ఎన్టీఆర్ రెండో వివాహం తర్వాత ఆయన జీవితంలో ఏమేం జరిగాయో వర్మ పంపిన వారు తన వద్ద నుంచి సమాచారం తీసుకుని వెళ్లారని లక్ష్మీపార్వతి అంటోంది. ఇదే జరిగితే మరోసారి ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చి ముఖ్యంగా బాలయ్యని, చంద్రబాబునాయుడుని వర్మ టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా గతంలో వర్మ 'శశికళ, జయలలిత'ల మీద కూడా చిత్రాలు తీస్తానని, మరికొందరు వివాదాస్పద వ్యక్తుల జీవితాలను తెరకెక్కిస్తానని చెప్పి ఏదో భయపెట్టి తర్వాత ఆ సంగతి పట్టించుకోలేదు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం కూడా కేవలం వార్తల్లోకి ఎక్కడానికేనా, లేక నిజంగా దీనికి రూపునిస్తాడా అనేది వేచిచూడాల్సివుంది...!