ఎప్పటికప్పుడు సంచలనాత్మక వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ హైలెట్ అయ్యాడు. మొన్నామధ్యన ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తానంటూ బయలుదేరిన వర్మ దాని కోసం ఒక పాటను కూడా రెడీ చేసి జనాల మీదకి వదిలాడు. ఇక 10 రోజుల పాటు ఎన్టీఆర్ బయో పిక్ పై బీభత్సంగా హడావిడి చేసిన రామ్ గోపాల్ వర్మ... ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తానని అధికారిక ప్రకటన చేసిన ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడి గురించిన ఎటువంటి ప్రకటన చెయ్యకపోయేసరికి వర్మ సైలెంట్ అయ్యాడు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించే దర్శకులు వీళ్ళు వాళ్ళు అంటూ వార్తలొచ్చేసరికి రామ్ గోపాల్ వర్మ మళ్ళీ మేలుకుని... ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్ర తెరకెక్కించే అవకాశం తనకి రాదని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. లక్షిస్ ఎన్టీఆర్ ని ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిని కలిసినప్పటినుండి సినిమా మొదలు పెడతానని... ఆయన లక్ష్మి పార్వతితో ఏం చూసి ఇష్టపడ్డారో... అసలు లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాక ఆయన జీవితం ఎటువంటి మలుపు తిరిగిందో.... అసలు ఎన్టీఆర్, లక్ష్మి పార్వతిని పెళ్లాడడానికి దారితీసిన పరిస్థితులను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తానని మీడియాకెక్కాడు. లక్ష్మి పార్వతితో పరిచయం దగ్గరనుండి మొదలుపెట్టి ఆయన మరణించేవరకు సినిమా తెరకెక్కిస్తానని చెబుతున్నాడు ఆర్జీవీ.
ఇక ఆర్జీవీ అలా మీడియాలో ఇంటర్వ్యూ ఇచ్చాడో లేదో ఇలా టిడిపి ప్రతినిధి బాబు రాజేంద్ర ప్రసాద్... ఆర్జీవికి కాలం చెల్లిపోయింది... ఆయన తీసిన బయోపిక్ ల పరిణామాలు ఏమిటో అందరికి తెలుసు. ఆయన ముంబై లో కూర్చుని ఎన్టీఆర్ జీవిత చరిత్ర తీస్తే తెలుగు ప్రజలెవరూ చూడరు. అసలు సినిమా మొదలు పెట్టె ముందు స్క్రిప్ట్ మొత్తం చంద్రబాబుకి చూపించి సినిమా తియ్యడానికి అనుమతి తీసుకుంటేనే సినిమా ఆయన తీస్తాడు. అసలు ఎన్టీఆర్ పక్కన లక్ష్మి పార్వతి కూర్చుంటే ఎవరూ చూడలేకపోయేవారు. అలాంటి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే తెలుగు ప్రజలే ఆర్జీవీ కి బుద్ది చెబుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మరి ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కొద్ది రోజులోనే మొదలుపెట్టి 2018 డిసెంబర్ కల్లా పూర్తి చేసి విడుదల చేస్తానని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నాడు.