నేటితరంలో ఎందరో సీనియర్ దర్శకులు సినిమా రంగాన్ని విడిచి వెళ్లిపోయారు. కేవలం నిర్మాతలను మన సినిమా వారు డబ్బులిచ్చే ఏటీఎం మిషన్స్‌గానే భావిస్తున్నారు. హీరోలకు సలాం కొట్టి, వారి ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి. దర్శకులు అవసరం ఉన్నా లేకున్నా వారు చెప్పినవన్నీ సమకూర్చి వారికి దాసోహం అని, వంగివంగి నమస్కారాలు పెట్టాల్సిన పరిస్థితి. తన సినిమా కథ ఏంటో? దర్శకుడు ఏమి తీస్తున్నాడో? హీరో ఏం చేస్తున్నాడో? ఉత్తరాది భామలు కొండల మీద కోతులను తెమ్మన్నా మౌనంగా తెచ్చి ఇవ్వాల్సిన స్థితి. నటీనటులకు, వారి మందీ మార్బలానికి స్టార్ హోటల్స్ నుంచి స్టార్ ఫుడ్ వరకు ఎందరికైనా ఓకే అనే కాలం వచ్చింది.
కర్చీఫ్‌లను వేసే నిర్మాతలు, భజనపరులు, కేవలం కాంబినేషన్‌ను సెట్ చేసి సినిమా ప్రారంభంలోనే టేబుల్ ప్రాఫిట్‌లు అందుకునే వారే ఈ ఫీల్డ్‌లో కనిపిస్తున్నారు. ఒక దిల్‌రాజు, అల్లుఅరవింద్ వంటి వారు తప్ప ఎందరో నిర్మాతలు పరిశ్రమను వదిలేశారు. ఇంకొందరు మాత్రం బుల్లి తెర చానెల్స్‌కి వచ్చి ఇక్కడ బుల్లితెర సీరియల్స్, షోలను నిర్వహిస్తున్నారు. సినిమా నిర్మాణం కంటే టీవీ రంగమే బెటర్ అని చెప్పాలి. భారీ పెట్టుబడులు పెట్టకుండా ఏ రోజు ఫలితం ఆరోజే తెలిసిపోతుంది. ఎవ్వరికీ గులాం చేయాల్సిన పనిలేదు. దాంతో నాడు దాసరి నుంచి క్రిష్ వరకు, చివరకు మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి, రాధిక నుంచి సుమ వరకు అందరూ టీవీ షోలను చేస్తున్నారు.
ఇక పలు చిత్రాలను నిర్మించిన మంచు వారి అమ్మాయి లక్ష్మీప్రసన్న కూడా తాజాగా జెమిని చానెల్ కోసం ఓ షోని నిర్మిస్తోంది. కానీ ఈ షోకి తాను హోస్ట్ చేయడం లేదు కాబట్టి భయపడాల్సిన పనిలేదు. ఆమె హోస్టింగ్ బాధ్యతలను లీడింగ్ యాంకర్ అండ్ సినీ నటి అయిన అనసూయకి అప్పగించింది. ఇక ఈ షో పేరు 'ఫిదా'. ఈ షో గురించి త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. సినిమాలను నిర్మించి, 'గుండెల్లో గోదారి, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' వంటి అనేక చిత్రాలలో పూర్తిగా నష్టపోయిన మంచు లక్ష్మికి బుల్లితెర అయినా కలిసొస్తుందేమో చూడాలి...!