సాధారణంగా స్టార్ హీరోల చిత్రాలు చాలా సేఫ్ అని చాలా మంది భావిస్తారు. కానీ దానికి ఉండే కష్టాలు దానికి కూడా ఉంటాయి. హైబడ్జెట్‌తో డబ్బులను నీళ్లలా ఖర్చుచేయాల్సివస్తుంది. పని దినాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి సీన్ రిచ్‌గా ఉండటం కోసం తెరనిండా తారలు, అత్యుత్తమ సాంకేతిక నిపుణులు, కోట్ల రెమ్యూనరేషన్లు, యాక్షన్ సీన్స్, ఛేజింగ్‌లు, విదేశాలలో పాటలు, అక్కడ కూడా గ్రూప్ డ్యాన్సర్లు, జూనియర్ ఆర్టిస్టులు.. ఇలా ఎన్నో సాదక బాదకాలుంటాయి. సినిమా ఏదైనా తేడా కొట్టిందంటే ఎంత పెద్ద నిర్మాత అయినా ఒళ్లు, ఇళ్లు అమ్ముకోవాల్సిందే. ఇక భారీ రేట్లకు బిజినెస్ జరగడం, సోషల్‌మీడియా వల్ల క్షణాల్లో టాక్ స్ప్రెడ్ అవ్వడం, నెగటివ్ రివ్యూలు, వీకెండ్‌లోనే ఎక్కువ మొత్తం సాధించాల్సిన పరిస్థితి ఉంటాయి.
స్టార్ హీరోలు, దర్శకులు, స్టార్ క్యాస్టింగ్, ఉత్తరాది భామలు, క్రేజ్ ఉన్న సంగీత దర్శకులు, ఫైట్ మాస్టర్స్, గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్‌లు, అంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్లు ఇచ్చినా స్టార్స్‌కి భయపడాల్సి వస్తుంది. మరోవైపు పైరసీ, ఎంత మంచి సినిమా అయినా రెండు మూడు వారాలకే శుభంకార్డు పడుతుంది. దీనికి ఉదాహరణగా 'బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్‌సింగ్' వంటివి ఉన్నాయి. ఇక 'మృగరాజు' దెబ్బకు దేవివర ప్రసాద్, 'స్టూవర్ట్‌పురం పోలీస్‌స్టేషన్' దెబ్బకు కె.ఎస్.రామారావు, 'బిగ్‌బాస్' దెబ్బకు విజయబాపినీడు, 'జాదూ, భీమా' ల దెబ్బకు ఎ.యం.రత్నం, 'నరసింహుడు' దెబ్బకు చెంగల వెంట్రావ్, 'పల్నాటి బ్రహ్మనాయుడు' దెబ్బకు మేడికొండ బ్రదర్స్, 'షిరిడి సాయి, ఓం నమో వేంకటేశాయ' దెబ్బకి మహేష్‌రెడ్డి, నాగార్జునతో పలు చిత్రాలు తీసిన శివప్రసాద్‌రెడ్డి, 'ఒక్కమగాడు' దెబ్బకు వైవిఎస్ చౌదరి, 'సైనికుడు, కంత్రి, శక్తి' దెబ్బలకు అశ్వనీదత్, 'ఐ' దెబ్బకు ఆస్కార్ రవిచంద్రన్, 'రక్షకుడు' దెబ్బకి కుంజుమోహన్.. ఇలా ఎందరోరోడ్డున పడ్డారు.
ఇక సినిమా ఫ్లాపయితే భారీరేట్లకు తమ ఇష్టానుసారం కొన్న తర్వాత ధర్నాలు చేసే డిస్ట్రిబ్యూటర్లు, బయర్లది మరో గొడవ. ఈ అనుభవాలు రజనీకాంత్‌కి 'కొచ్చాడయాన్, లింగా'లతో అర్ధమైంది. దాంతో ఆయన ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. శంకర్, లైకా ప్రోడక్షన్స్ బలవంతంతో '2.0' చేస్తున్నాడు. మరో పక్క తన అల్లుడు ధనుష్ నిర్మాతగా 'కాలా' చిత్రం చేస్తున్నాడు. ఇక విషయానికి వస్తే 'కబాలి' చిత్రం పెద్దగా టాక్ రాకపోయిన ఒడ్డున పడి లాభాలు మూటగట్టుకుందంటే ఆ చిత్రాన్ని లిమిటెడ్ బడ్జెట్‌లో తీయడమే. ఇక రజనీ 'కాలా' చిత్రాన్ని కూడా తక్కువ బడ్జెట్‌లో ధనుష్ చేత నిర్మింపజేస్తున్నాడు.
పెద్ద హంగామాలు, లోకేషన్లు, విపరీతమైన పెట్టుబడికి దూరంగా తీయడం నిజంగా మంచిపరిణామమే. సినిమాలోకంటెంట్, సరిగ్గా హ్యాండిల్ చేసే దర్శకుడు రంజిత్‌పా ఉంటే ఎంత తక్కువ బడ్జెట్‌తో తీసినా వీకెండ్‌లోనే నిర్మాత, బయ్యర్లు లాభపడతారు. కాబట్టి కంటెంట్‌కి స్టార్‌హీరో తోడయితే ఇక సినిమా సూపర్‌హిట్టే. ఇక 'కాలా' చిత్రం మొదటి పోస్టర్‌తో పాటు తాజాగా విడుదల చేసిన పోస్టర్ కూడా టీవీ సీరియల్ పోస్టర్‌గా ఉందని అంటున్నారు. అయితే సినిమాలో కంటెంట్ ఉంటే ఆ విమర్శలకు 'కాలా' గట్టి సమాధానమే చెబుతుంది..!