సినీ హీరో శ్రీకాంత్ ఇంట్లో కార్ల ధ్వంసం అనే న్యూస్ హైలెట్ అయ్యింది. శ్రీకాంత్ బీఎండబ్ల్యు, ఫోర్డ్ కార్ల అద్దాలు పగులగొట్టిన వ్యక్తి.... అనే హెడ్ లైన్స్ వచ్చేశాయి ఛానల్స్ లో. శ్రీకాంత్ ఇంట్లో గతంలో పనిచేసిన మనిషే శ్రీకాంత్ కాంపౌండ్ లోకి ప్రవేశించి కారు అద్దాలను విచ్చలవిడిగా పగల గొట్టి నానా రచ్చ చేశాడనే న్యూస్ హల్చల్ చేసింది. ఇక ఆ వ్యక్తిని శ్రీకాంత్ పట్టుకోవడము, పోలీస్ లకు అప్పజెప్పడము జరిగిపోయింది. అయితే ఆ దాడి ఎందుకు జరిగిందో అని పోలీస్ లు ఆరాతీయ్యగా... కర్నూలుకు చెందిన వెంకటేష్ అనే అతను గత పది సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్‌లో పలువురి ఇంట్లో వంట పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే వెంకటేష్ కి హీరో శ్రీకాంత్ అంటే వల్లమాలిన అభిమానం. శ్రీకాంత్ మీద అభిమానంతోనే వెంకటేష్, శ్రీకాంత్ ఇంట్లో 3 నెలలు పనిచేశాడు. అయితే వెంకటేష్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో శ్రీకాంత్ కుటుంబం అతన్ని పనిలో నుండి తీసివేసింది. కానీ వెంకటేష్.. శ్రీకాంత్ ఇంట్లో మానేసినా.... శ్రీకాంత్ తనకి రోజు కలలోకి వస్తున్నాడని... అందుకే శ్రీకాంత్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా.... కుదరకపోయేసరికి లాభం లేదనుకుని నిన్న శనివారం శ్రీకాంత్ ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించి శ్రీకాంత్ మీదున్న కోపంతో ఆయన కార్ల అద్దాలు ధ్వంసం చేసి శ్రీకాంత్ పై దాడికి యత్నించగా శ్రీకాంత్ అతన్ని చాకచక్యంగా పట్టుకుని పోలీస్ లకు అప్పగించాడు. ఇక వెంకటేష్ ని అదుపులోకి తీసుకున్న పోలీస్ లు విచారణ చేపట్టారు.