తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే వేదిక మీద. చూడడానికే రెండు కళ్ళు సరిపోవేమో. అయితే ఈ అరుదైన ఘటన మాత్రం నవంబర్ లో జరగబోతుందని ప్రచారం మొదలైంది. ఇంతకీ సూపర్ స్టార్స్ ఇద్దరూ ఒకే వేదిక మీద కలవబోయే విశేషం ఏమిటంటే.... శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా రోబో సీక్వెల్ 2.0 సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంది. ఇక భారీ బడ్జెట్ మాత్రమే కాదు... భారీ ప్రమోషన్స్ తోనూ 2.0 బాగా ఆకట్టుకుంటుంది.
దుబాయ్ లో 2.0 ఆడియో వేడుక, చెన్నైలో 2.0 థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్.... హైద్రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఇలా అన్ని భారీగా ప్లాన్ చేస్తున్నారు 2.0 మేకర్స్. ఇక 2.0 రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఏషియన్ సునీల్ దాదాపు 80 కోట్ల భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి తెలుగు హక్కులను అంత భారీగా అమ్మి సొమ్ము చేసుకున్న 2.0 నిర్మాతలు తెలుగులో కూడా సినిమాకి భారీగా ప్రమోషన్ చెయ్యాలి కదా .. అందుకే ఇక్కడ హైదరాబాద్ లో 2.0 ఆడియో వేడుక గాని లేదంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గాని ప్లాన్ చేస్తున్నారట.
నవంబర్ 22 న జరగబోయే ఈ వేడుకకి తమిళ సూపర్ స్టార్ కోసం తెలుగు సూపర్ స్టార్ మహేష్ వస్తాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇంకా దర్శకుడు శంకర్, సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహ్మాన్, హీరోయిన్ అమీ జాక్సన్ హాజరవుతారని చెబుతున్నారు. మరి శంకర్ మీదున్న గౌరవంతో మహేష్ బాబు ఈ వేడుకకి హాజరవుతాడని చెబుతున్నారు. అసలు మహేష్ స్పైడర్ ఆడియో వేడుకకి దర్శకుడు శంకర్ హాజరు కావాల్సి ఉండగా ఆయనకు వేరే పని పడడంతో మహేష్ స్పైడర్ ఈవెంట్ కి హాజరు కాలేకపోయాడు శంకర్. ఇక అప్పుడు మహేష్ తో శంకర్ ని చూడలేకపోయినా... ఇప్పుడు 2.0 వేడుకలో శంకర్, రజినీలతో పాటే మహేష్ ని కూడా చూడొచ్చన్నమాట.