సోషల్ మీడియాలో వర్మ, కత్తి మహేష్ వంటి వారి వల్ల, ఇక హీరోలకు వీరాభిమానులైన వారి వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. నిజాయితీగా మాట్లాడే హక్కు ఉన్నప్పటికీ తమ అభిమాన హీరో మీద ఏమైనా కామెంట్స్ చేస్తే వారిని ఫ్యాన్స్ వదలడం లేదు. నానా తిట్లను తిడుతూ, వారిని, వారి కుటుంబ సభ్యులను కూడా వివాదంలోకి లాగి బూతులు తిట్టడం, చంపేస్తామనే బెదిరింపులు దాకా ఈ వ్యవహారాలు వెళ్తున్నాయి. ఇక విషయానికి వస్తే అన్నారాజన్ అనే హీరోయిన్ తాజాగా మలయాళంలోకి ఎంటర్‌అయింది. ఆమెకు వరుసగా రెండు అవకాశాలు రాగా రెండూ పెద్ద హిట్లుగానే నిలిచాయి. దాంతో ఈ అమ్మడికి బాగా క్రేజ్ పెరిగిపోయింది. అన్ని రకాల మీడియాలు ఆమెతో ఇంటర్వ్యూలని బాగా ప్రసారం చేశాయి.
ఇక ఓ చానెల్‌లో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అన్నా రాజన్‌ని ఉద్దేశించి మీరు దుల్కన్ సల్మాన్‌తో నటించడానికి ఇష్టపడతారా? లేక ఆయన తండ్రి మెగాస్టార్ మమ్ముట్టితో నటించడానికి ఇష్టపడతారా? అని ప్రశ్నించడంతో ఆమె తమాషాగా దుల్కర్ సల్మాన్‌తోనే నటిస్తాను.. అయితే ఆ చిత్రంలో ఆయన తండ్రి మమ్ముట్టి, దుల్కర్‌సల్మాన్‌కి స్వయంగా తండ్రిగా నటిస్తేనే చేస్తాను.. అని కాస్త అత్యుత్సాహంతో సమాధానం చెప్పింది, నిజానికి ఇదేమంత పెద్ద విషయం కాదు. దుల్కర్‌సల్మాన్‌కి తండ్రి అయిన మమ్ముట్టికి ఆయన కుమారుడి వయసే ఉంటుంది అన్నారాజన్‌కి. కాబట్టి దుల్కర్‌సల్మాన్‌లాగానే ఆమె కూడా మమ్ముట్టిని తన తండ్రి వయసు వాడిగా భావించి ఆ వ్యాఖ్యలు చేసింది. కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం మమ్ముట్టి అభిమానులను రెచ్చగొట్టాయి. దాంతో వారు అన్నారాజన్‌ని సోషల్ మీడియాలో నానా రకాలుగా హింసపెట్టారు.
మా అభిమాన హీరోని అంతగా అవమానిస్తావా? అంటూ అన్నారాజన్‌ని మమ్ముట్టి ఫ్యాన్స్ ఏడిపించారు. సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ని చూసి ఆమె ఏడ్చేసింది. అంతేకాదు ఏడుస్తూ ఓ వీడియో తీసి అందులో మమ్ముట్టి ఫ్యాన్స్‌కి క్షమాపణలు చెబుతూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మమ్ముట్టి అంటే నాకెంతో గౌరవం. సోషల్ మీడియాలో నన్నే కాదు.. నా తండ్రిని కూడా తిడుతున్నారు... అంటూ క్షమాపణలు కోరింది. మొత్తంగా చూస్తే తెలుగు, తమిళ స్టార్స్ ఫ్యాన్స్‌కే ఇంత పిచ్చి అనుకుంటే అక్షరాస్యతా శాతం ఎక్కువగా, మంచి హెల్తీ కాంపిటీషన్ ఉండే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండే మాలీవుడ్‌లో కూడా ఫ్యాన్స్ ఇలానే తయారయ్యారనిపిస్తోంది.