ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో బయోపిక్‌లు పెరిగాయి. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వారు తమదైన శైలిలో తెరపై చూపించి ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే మిల్కాసింగ్, అజారుద్దీన్, ఎమ్మెస్‌ధోని, సచిన్ టెండూల్కర్ వంటి వారి జీవితాలు బయోపిక్‌లుగా తెరకెక్కాయి. అజారుద్దీన్ చిత్రం తప్ప మిగిలినవి బాగానే ఆడాయి. తాజాగా ఇండియన్ క్రికెట్ ఉమెన్‌గా అత్యధిక పరుగులు తీసి, ఇండియన్ మహిళా క్రికెట్ టీం కి కెప్టెన్ అయిన మిథాలీరాజ్ జీవిత చరిత్ర కూడా వెండితెరపైకి రానుంది. కేవలం పురుషుల క్రికెట్‌కు మాత్రమే మంచి ఆదరణ ఉంటే ఇండియాలో మిథాలీరాజ్ ఆస్థాయి రావడానికి ఎంత కష్టపడిందో ఇందులో చూపించనున్నారు. దీనిపై మిథాలీ కూడా హర్షం వ్యక్తం చేసింది.
ఇక మిథాలీరాజ్‌పాత్రకు దక్షిణాదిన అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న సమంతను అడిగినట్లు సమాచారం. మరి దీనిపై ఆమె రియాక్షన్ మాత్రం తెలియలేదు. ప్రస్తుతం మరో వారం కూడా లేని నాగచైతన్య వివాహ పనుల్లో ఆమె బిజీగా ఉంది. పెళ్లయిన తర్వాత కూడా ఆమె నటిస్తానని చెప్పడం, ఇది కూడా 'మహానటి' వంటి బయోపిక్, మహిళలకు స్ఫూర్తినిచ్చే పాత్ర కావడంతో ఆమె చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈచిత్రాన్ని వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది.
ఇక వీరు గతంలో 'కహాని'తో పాటు 'మేరికోమ్' జీవిత చరిత్రను కూడా ప్రేక్షకులకు అందించారు. తాము మహిళలకు స్ఫూర్తినిచ్చే చిత్రాలను తీయడానికి ఎప్పుడు సిద్దమేనని ఆ సంస్థ సీఈవో ప్రకటించాడు. ఇక ప్రస్తుతం ఇండియన్ టీం కపిల్‌దేవ్‌సారధ్యంలో 1983లో గెలిచిన వన్డే వరల్డ్‌కప్ ఆధారంగా '83' అనే చిత్రం రూపొందుతుండగా, భారతీయ మహిళా క్రికెటర్‌గా అత్యథికవికెట్లను తీసుకున్న బౌలర్ ఝులన్ గోస్వామి చిత్రం కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.