గత ఏడాది మధ్యలో ప్రారంభమైన స్పైడర్ చిత్రం ఈ ఏడాది దసరాకి విడుదలైంది. ఈ సినిమాని మురుగదాస్ చాలా నెలలు చెక్కుతూనే ఉన్నాడు. అలా మెరుగులు దిద్ది దిద్ది ప్రేక్షకులకు అందించాడు. కానీ తెలుగు ప్రేక్షకులు స్పైడర్ ని రిజెక్ట్ చెయ్యగా... తమిళులు మాత్రం దగ్గరకి తీశారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు చాలా రోజులు పాటు అంటే దాదాపు ఎనిమిది నెలల పాటు మోకాలి నొప్పితోనే స్పైడర్ షూటింగ్ లో పాల్గొన్నాడంట. ఈ విషయాన్నీ మహేషే స్వయంగా చెబుతున్నాడు. మోకాలి నొప్పితో బాధపడుతున్న తనకి డాక్టర్స్ ఆపరేషన్ చెయ్యాలన్నా వినకుండా షూటింగ్ లో పాల్గొనడమే కాదు.. తనకి మోకాలి నొప్పి ఉన్నట్టు కూడా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడట.
మరి మహేష్ ఉన్నట్టుండి ఈ విషయాన్నీ ఇప్పుడే బయటపెట్టాడు. ఒకవేళ ఆపరేషన్ చేయించుకుంటే దాదాపు 5 నెలల రెస్ట్ అవసరమవుతుందని... ఆలా రెస్ట్ తీసుకుంటే స్పైడర్ ని అనుకున్న టైం కి పూర్తి చేయలేమని భావించి మహేష్ ఎవ్వరికి నొప్పి విషయం చెప్పకుండా... స్పైడర్ షూటింగ్ పూర్తి చేశాడట. తాను గనక అలా ఐదు నెలలు రెస్ట్ తీసుకుంటే నిర్మాతలకు తన వల్ల ఏడు నుండి ఎనిమిది కోట్ల నష్టం వాటిల్లేదని చెప్పుకొచ్చాడు. కేవలం ఒక ఫిజియో థెరపిస్ట్ సహాయం తీసుకుని స్పైడర్ షూట్ లో పాల్గొన్నట్లు చెప్పాడు.
ఇక స్పైడర్ లో అతి పెద్ద యాక్షన్ సీన్స్ బండరాయి దొర్లిపడే సన్నివేశం, రోలర్ కోస్టర్ సన్నివేశం మోకాలి నొప్పితోనే చేశానంటున్నాడు మహేష్. మరి ఇంత నొప్పి అప్పుడు ఉందట కానీ ఇప్పుడు స్పైడర్ షూటింగ్ పూర్తవగానే నొప్పి తగ్గిపోయిందని చెబుతున్న మహేష్ కి ఆపరేషన్ కూడా అక్కర్లేదని డాక్టర్స్ చెప్పారట. మరి ఇదంతా దేవుడి దయతోనే జరిగింది అంటున్నాడు మహేష్.