కెరీర్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి సోదరునిగా పవన్ పరిచయమైన మొదట్లో ఆయన పేరు కళ్యాణ్‌బాబుగా ఉండేది. కానీ తమ ఇలవేలుపు అయిన ఆంజనేయస్వామి మీద ఉన్న భక్తితో తన అన్నయ్య చిరంజీవిగా స్క్రీన్‌నేమ్‌ని మార్చుకున్నట్లుగానే త్వరలోనే కళ్యాణ్‌బాబు కాస్తా పవన్ ( ఆంజనేయ స్వామి పేరును కలుపుకున్నాడు. ఈ స్క్రీన్‌నేమ్ ఆయనకు బాగా అచ్చివచ్చింది. అయితే ప్రస్తుతం ఆయన రాజకీయాలలోకి అడుగుపెడుతున్నాడు.
మరి రాజకీయాలలో కూడా ఆయన పవన్‌కళ్యాణ్ పేరుతోనే ఉంటాడా? రాజకీయాల కోసం మరో పేరు చూసుకుంటాడా? అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాజాగా గూగుల్‌లో పవన్‌కళ్యాణ్ అనే పేరును టైప్ చేస్తే ఆయన పేరును 'కుషాల్ బాబు'గా చూపుతోంది. దీంతో ప్రేక్షకులు మరీ ముఖ్యంగా ఆయన అభిమానులు కుషాల్ బాబు పేరుని చూసి షాకవుతున్నారు. ఇదేంటి పవన్ పేరు మార్చుకున్నాడా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు.
మిగిలిన అన్నిచోట్లా పవన్ కళ్యాణ్ అని చూపుతున్నా కూడా గూగుల్‌లో మాత్రం 'కుషాల్ బాబు'గానే కనిపిస్తుండటంతో రాజకీయ రంగప్రవేశం సమయంలో ఆస్ట్రాలజీ, న్యూమరాలజీని నమ్మి పవన్ తన పేరు మార్చుకున్నాడని, ఈ కొత్త పేరును కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే ఎంపిక చేశాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇది నిజమేనా? లేక సాంకేతికంగా ఏదైనా తప్పు దొర్లిందా? అనే విషయాన్ని పవన్ లేదా గూగుల్ సంస్థ క్లారిటీ ఇస్తేనే గానీ దీనిపై మొదలైన వాదనలకు సరైన సమాధానం లభించే అవకాశం లేదు.