'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అనే ఒకే ఒక్క క్యూరియాసిటీతో ఏకంగా దేశవ్యాప్త ప్రేక్షకులు గడిపారు. ఈ చిక్కుముడి ఈ ఏడాది ఏప్రిల్ 28న తెలియనుందని తెలిసి ఎన్నో ఊహించుకున్నారు. ఇక ఈ చిత్రం సాధించిన ఘన విజయంలో కట్టప్ప పాత్ర కూడా ఒకటని ఒప్పుకోవాలి. కట్టప్ప పాత్రను రాజమౌళి కేవలం సత్యరాజ్‌ని ఊహించుకునే తయారు చేశాడా? అనేంతగా ఈ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఆయన తన నటనా కెరీర్ ప్రారంభంలో చిన్నిచిన్ని వేషాలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్‌గా చేశాడు. తమిళంలో ఆయన నాడు నటించిన పలు చిత్రాలు తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. అలా ఆయన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే.
ఇక ఆయన నటించిన '100వ రోజు' చిత్రంలో విలన్‌గా, సుమన్ హీరోగా మణివణ్ణన్ దర్శకత్వంలో రూపొందిన 'దర్జాదొంగ' వంటి అనేక చిత్రాలలో నటించాడు. ఇక ఆయన తమిళం, తెలుగులోనేకాదు... మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా రాణించాడు. 'బాహుబలి'కి ముందు ప్రభాస్ చేసిన 'మిర్చి' చిత్రంతో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఇన్ని భాషల్లో, ఇన్ని వేషాలలో నటించిన ఆయన తనకు సరైన గుర్తింపు 'కట్టప్ప' ద్వారానే వచ్చిందని, తనను ఇప్పుడు అందరూ కట్టప్ప అనే పిలుస్తున్నారని చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన వ్యక్తిత్వంలో కూడా మంచివాడు. ఆపదలో ఉన్నవారికి తనవంతు సాయం చేస్తాడు. ఇక సత్యరాజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు శిబిరాజ్ ట్విట్టర్ వేదిక ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు. దీనిలో భాగంగా తన తండ్రి సత్యరాజ్ చిన్ననాటి ఫొటోను కూడా ఆయన పోస్ట్ చేశాడు. 'తన నటనతోనే కాకుండా మంచి వ్యక్తిత్వంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను దోచుకున్న ఈ బాలుడికి జన్మదిన శుభాకాంక్షలు అని' శిబిరాజ్ తన తండ్రి చిన్ననాటి ఫొటోతో పాటు ట్వీట్ చేశాడు.