తాజాగా పవన్‌కళ్యాణ్ రెండో భార్య, ఆయన నుంచి విడాకులు తీసుకున్న రేణూదేశాయ్ ఈ మధ్య తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నా అనుకున్న వారెవ్వరు అక్కడ లేకపోవడం, తెల్లవారుజామున 3గంటలకు వచ్చి తన సోదరి తనను హాస్పిటల్‌కి తీసుకుని వెళ్లిందని, నాటి నుంచి నాకు, నా పిల్లలకు మంచి తోడు లభిస్తే బాగుండు అనిపిస్తోందని తెలిపింది. ఏమో దేవుడు నా జీవితంలోకి మరలా ఎవరినైనా పంపుతాడేమో అనే వ్యాఖ్యలు చేసింది. కానీ ఈ మాటలకు విరుద్దంగా వీటిని ఖండిస్తూ పవన్‌ఫ్యాన్స్ రేణుదేశాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మీరు రెండో పెళ్లి చేసుకుంటారా? ఐ హేట్ యు,...మీరు రెండో వివాహం చేసుకుంటే మీరు చచ్చినంత ఒట్టు. మీరు రెండో వివాహం చేసుకుంటే మీ మీద గౌరవం తగ్గిపోతుంది...పవన్‌ని అన్నా అని పిలుస్తాం.. మిమ్మల్ని వదినా అని పిలుస్తాం... మీ నిర్ణయంతో అందరూ బాధపడే అవకాశం ఉందని ఆమెపై నానా కామెంట్స్ చేస్తున్నారు. మరి పవన్ అంటే అంత అభిమానం ఉన్నవారు పవన్ ఆమెకు విడాకులు ఇచ్చేటప్పుడు విడాకులు వద్దు.. ఇద్దరు కలిసే ఉండండి.. అని పవన్‌పై ఎందుకు ఒత్తిడి తేలేదు? నిజంగా పవన్-రేణుదేశాయ్‌ల మంచి కోరే వారైతే రేణుని వదినా అని పిలిచే గౌరవం ఉంటే ఆమె జీవితాన్ని పవన్ నాశనం చేయడంపై ఎవ్వరూ ఎందుకు గొంతు విప్పలేదు.
పవన్ మాత్రం మూడు కాదు కదా..! ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. కానీ ఆయన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంత కాలానికి తోడుంటే బాగుంటుందని చేసిన వ్యాఖ్యలపైనే ఇంతగా పవన్ అభిమానులు ఫైర్ ఎందుకు కావాలి...? వీటిని చూసి రేణుదేశాయ్ ఫైర్ అయిపోయింది. ఈ కామెంట్స్ తనను ఒక్కరిని ఉద్దేశించి చేసినవి కావని, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం అని మండిపడింది. ఇలాంటి ఆలోచనలు ఉన్న మగాళ్ల మధ్య మనం బతుకుతున్నాం?
ఒకవైపు మహిళా సాధికారికత, స్త్రీ స్వేచ్చ, స్త్రీలకు అధికారం, సమానత, అత్యాచారాలకు వ్యతిరేకంగా చట్టాల కోసం ప్రసంగాలు చేస్తున్న మగాళ్లే ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాను. ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి దృష్యా మంచితోడు దొరికితే బాగుంటుందని అనడం కూడా తప్పేనా? నా జీవితాంతం నేను తప్పు చేశాను... అనే భావనతో ఒంటరిగా బతకాలా? అమ్మాయిల భవిష్యత్తు బాగుండాలంటే తల్లులు తమ మగపిల్లలను పద్దతిగా పెంచాలని నేను దేవుడిని కోరుకుంటున్నానని ఆమె ఆవేదనతో వ్యాఖ్యానించింది.