బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు తేజం, ఒలింపిక్ విజేత పి.వి.సింధు తాజాగా అమితాబ్‌బచ్చన్ హోస్ట్‌గా వస్తోన్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమంలో పాల్గొంది. ఈమె తన ఖాతాలో 12 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి రూ.12.5లక్షలు గెలుచుకోగా 25లక్షలను అందించే 13వ ప్రశ్న సమాధానం చెప్పడంలో సింధు కాస్త తప్పులో కాలేసింది. అమితాబ్ బచ్చన్ 13వ ప్రశ్నగా ఆంధ్రప్రదేశ్‌లోని 'వైయస్సార్'సీపీ పార్టీలోని వై.యస్.ఆర్. అంటే ఏమిటి? అని అడిగాడు.
అది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి పేరుతో స్థాపించిన పార్టీ అని భావించిన సింధు దానికి ఇచ్చిన ఆప్షన్లయిన 1. యువ సత్యరాజ్యం 2.ఎడుగూరి సంధింటి రాజశేఖర 3. యూత్ షల్ రూల్ 4. యువజన శ్రామిక రైతుల ఆప్షన్స్ లో ఎడుగూరి సంధింటి రాజశేఖర అని ఆన్సర్ చెప్పింది. కానీ అమితాబ్ బాగా ఆలోచించుకోమని కోరడంతో ఆమె తన సోదరి సహాయంతో అసలు ఆన్సరైన యువజన శ్రామిక రైతు అనే దానిని ఆన్సర్‌గా చెప్పి రూ.25లక్షలు గెలుచుకుంది.
నిజానికి ఈ కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో పి.వి.సింధు పాల్గొన్నది హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిధుల కోసం కావడం విశేషం. దీనికి నందమూరి బాలకృష్ణ చైర్మన్‌గా ఉన్నాడు. ఆయన కూడా తన తల్లి పేర నిర్మితమైన ఈ క్యాన్సర్ హాస్పిటల్ కోసం విదేశాలలో కూడా విరాళాలు వసూలు చేస్తూ ఉంటాడు. మొత్తానికి ఓ మంచి కార్యక్రమంలో పాల్గొన్న సింధుని పలువురి ప్రశంసలతో పాటు ఎందరికో స్పూర్తినిస్తుందని చెప్పవచ్చు.