మొత్తానికి ఒకటి రెండు నెలలుగా తెలుగులో సినీ కుటుంబాలలో అత్యంత విలువైన 'అక్కినేని కోడలి'గా సమంత మారుతుందనే విషయం రోజూ వార్తల్లో ఉంటోంది. ఆమె పెళ్లికి కట్టుకునే చీర నుంచి ఆమె పెళ్లి ఫొటోల వరకు ఆమె పేరు మాంచి ట్రెండింగ్‌లో ఉంటోంది. ఇక ఇప్పుడు ఆమె నాగచైతన్యకి భార్య కూడా అయింది. ఇలాంటి సమయంలో సమంత ఏ బిజినెస్‌మేన్‌నో లేక పరభాషా నటుడిని వివాహం చేసుకున్నా కూడా ఆమె పేరు ఇంత సంచలనంగా మారి ఉండేది కాదు.
కానీ ఆమె టాలీవుడ్‌లో అగ్రకుటుంబానికి చెందిన అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడం వల్లనే ఆమెకు మరింత పేరు వచ్చింది. సాధారణంగా హీరోయిన్లకు పెళ్లయితే ఆల్‌రెడీ వారు నటిస్తున్న చిత్రాల క్రేజ్ తగ్గడం టాలీవుడ్ సంప్రదాయం. కానీ దానికి భిన్నంగా సమంత పెళ్లి వల్ల ఇప్పుడు ఆమెతో సినిమాలు చేస్తోన్న నిర్మాతలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె 'జనతాగ్యారేజ్' తర్వాత ఎంతో గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమె నటించిన రెండు చిత్రాలు వారం గ్యాప్‌లో విడుదలకు సిద్దమవుతున్నాయి.
తన మామగారు నాగార్జునతో కలిసి నటించిన 'రాజుగారి గది2'లో సమంత నటనలో ఇరగదీసిందని అంటున్నారు. ఇక తమిళంలో ఆమె స్టార్ విజయ్‌తో నటిస్తున్న 'మెర్సల్' చిత్రంలో ఆమె కాస్త గ్లామర్‌గానే కనిపిస్తోంది. ఈచిత్రం తెలుగులో 'అదిరింది' పేరుతో విడుదల చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ రెండు చిత్రాలకే కాదు.. రాబోయే 'మహానటి, రంగస్థలం 1985' చిత్రాలకు కూడా ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుందని చెప్పవచ్చు.