బాహుబలి, రుద్రమదేవి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాల విజయంతో... చారిత్రాత్మక సినిమాలపై ఇప్పుడున్న దర్శకులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఇక హీరోలకు కూడా హిస్టారికల్, పీరియాడిక్ సినిమాలపై ఇంట్రెస్ట్ పెరగడమే కాదు... పూర్తి కాన్ఫిడెంట్ కూడా వచ్చేసింది. అందుకే అలాంటి సినిమాల్లో నటించడానికి హీరోలు ఎటువంటి వెనుకడుగు వెయ్యడం లేదు. ఆ సినిమాల ప్రభావంతోనే చిరంజీవి కూడా ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ జీవిత చరిత్రను 'సై రా నరసింహారెడ్డి'గా చెయ్యబోతున్నాడు. ఇక రాజమౌళి కూడా బాహుబలి తర్వాత ఎలాంటి చిత్రం చెయ్యబోతున్నాడంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కానీ రాజమౌళి మాత్రం ఏదైనా ఒక ప్రేమ కథా చిత్రాన్ని చేస్తానని చెప్పడమే గాని ఎక్కడా ఆ సినిమా మొదలు పెట్టింది లేదు. అలాగే రాజమౌళి - మహేష్ కలయికలో ఒక సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. అయితే ఇదే విషయాన్నీ అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు కూడా చెబుతున్నారు. అయితే ఇప్పుడు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ... మహేష్ ఛత్రపతి శివాజీ టైటిల్ తో సినిమా చేస్తే చూడాలని వుంది అంటూ ఆశాభావం వ్యక్తంచేశాడు. అది రాజమౌళి కాంబోలో తెరకెక్కితే ఎలా ఉంటుంది? ఊహే అదిరిపోలా! చారిత్రక ఛత్రపతి శివాజీ చిత్రాన్ని సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్లాన్ చేసినా అప్పట్లో అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు కృష్ణగారి కొడుకు మహేష్ బాబు ఆ సినిమా చేస్తే బావుంటుందని గోపాలకృష్ణ అంటున్నారు.
మరి ఆ ఛత్రపతి శివాజీ హిస్టారికల్ సినిమాని మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తే ఇంకా బావుంటుందని మహేష్ అభిమానులు కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఈ సీనియర్ రైటర్ సూచనలను ఈ హీరోగారు, దర్శకుడు రాజమౌళి పాటిస్తారేమో!