ఏ సమాజంలో అయినా పురుషాధిక్యం అన్నది సహజం. పుట్టుకతోనే శారీరకంగా మగవారిని బలవంతులుగా ఆడవారిని బలహీనులుగా దేవుడు పుట్టించాడు. ఇక మనదేశంలో పురుషాధిక్యం అనేది మరింత ఎక్కువ. ఇక్కడ అన్ని రంగాలలో పురుషులదే ఆధిక్యం. కానీ నేటి నవతరం మహిళలు పురుషులతో సమానంగా ఎదుగుతున్నారు. కానీ ఈ క్రేజ్, హీరోలకు తగ్గట్లుగా హీరోయిన్లకు ఇమేజ్ అనేవి కేవలం పురుషులను తిట్టడం ద్వారానో, లేదా సమాజాన్ని, ఇండస్ట్రీలోని మగవారిని తిడుతూ కూర్చుంటే రావు. కనీసం నేటితరం మహిళలైనా తాము ఎదగడమే కాదు... మరోవైపు తమ వైపు నుంచి ఇతర మహిళలు, ఇతర నిరక్ష్యరాస్యులై మగ్గిపోతున్న మహిళలకు అండగా నిలబడి వారిని కూడా చైతన్యం చేసినప్పుడే సమసమాజం వస్తుంది.
అంతేగానీ వార్తల్లో ఉండేందుకు, నిత్యం టచ్‌లో ఉంటూ తమ పేరు హెడ్‌లైన్స్‌లో ఉండేట్లు మాటలు చెబితేరాదు, చేతల్లో మహిళలంతా కలిసికట్టుగా ఎదిగితేనే పురుషాధిక్యాన్ని మహిళలు సవాల్ చేయగలుగుతారు. ఇక ఎన్టీఆర్ నుంచి చిరంజీవి, నాని వరకు, సావిత్రి, వాణిశ్రీ వరకు అందరూ కెరీర్‌లో అవమానాలు ఎదుర్కొని చిన్న చిన్న పాత్రలు చేస్తూ, జూనియర్ ఆర్టిస్టుల కంటే హీనంగా కెరీర్ మొదట్లో ఉన్నవారే. వారే సమాజాన్ని, ఇండస్ట్రీని ఎదిరించి స్టార్స్‌గా చలామణి అయి పరిశ్రమను శాసించారు. మేల్ వర్షిప్ అనేది నిజంగానే ఉంది. దానిని ఎవ్వరూకాదనడం లేదు. కానీ ఒట్టి మాటలు కట్టిపెట్టు, గట్టిమేలు తలపెట్టవోయ్ అనేది అసలైన తారకమంత్రం. కానీ తాప్సి విషయానికి వస్తే ఈ అమ్మడికి ఉన్నది గోరంత,.. చేసే హడావుడి, గోల కొండంత. నాడు దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్లి దక్షిణాదిని ఎండగట్టింది. దక్షిణాదిలో తనలోని ప్రతిభను ఎవ్వరూ గుర్తించలేదని, తనకు తగ్గ పాత్రలను ఇవ్వలేదని మండిపడింది. ఆ తర్వాత రాఘవేంద్రరావుని కించపరిచింది. ఇక ఆమె బాలీవుడ్‌లో 'బేబి' చిత్రంతో హిట్ కొట్టింది. తర్వాత చేసిన 'పింక్' చిత్రమైతే మాస్టర్ పీస్‌గా చెప్పవచ్చు.
కానీ 'పింక్' ముందు తర్వాత సరైనహిట్స్‌లేవు. 'నామ్ షబానా, రన్నింగ్‌షాది' తో పాటు 'జుడ్వా 2' కూడా నిరాశపరిచింది. ఈ సమయంలో అమ్మడికి ఓర్పు అవసరం. తనలోని బలాలు, బలహీనతలపై దృష్టి పెట్టి ఎందుకు వెనుక బడుతున్నానో యోచన చేస్తే టాలెంట్ ఉన్నవారు ఎప్పటికైనా తమ సత్తాను చాటుకుంటారు. ప్రియాంకాచోప్రా, దీపికాపడుకొనే, కంగనారౌనత్ వంటి వారు అలా ఎదిగిన వారే.కానీ రెండు హిట్స్ వచ్చేసరికి ఆమె 'నాలోని ప్రతిభను ఎవ్వరు గుర్తించడం లేదు. స్టార్స్‌తో సమానంగా నాకు క్రేజ్ ఉన్నా స్టార్ హీరోలు నాకు అవకాశాలివ్వడం లేదని తిట్టిపోస్తోంది'. ఈ మాటలు ఆమెకు మంచి చేయకపోగా కీడు చేసే ప్రమాదం ఉంది.