సాదారణంగా నేచురల్ స్టార్ నాని తన సినిమాల విడుదల సమయంలో తానే నటించిన వీడియో ప్రమోషన్లను విడుదల చేసి బాగా అలరిస్తూ ఉంటాడు. అలాగే ఇప్పుడు పలువురు పెద్ద చిత్రాల వారే కాదు..చిన్న చిత్రాల మేకర్స్ కూడా సినిమా విజయంలో కీలకపాత్రను పోషిస్తున్న ప్రమోషన్లను డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ప్రయత్నమే శివబాలాజీ చేశాడు. ఆయన బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ విజేతగా నిలిచి భారీ ప్రైజ్‌మనీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. దాంతో తాను, రాజీవ్‌కనకాల కలిసి నటిస్తున్న 'స్నేహమేరా జీవితం' చిత్రం ప్రమోషన్ కోసం బిగ్‌బాస్‌షో శైలిలో శివబాలాజీ ఓ వినూత్నమైన వీడియోను తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ వీడియోలో బిగ్ బాస్ వాయిస్‌ని వినిపించాడు.
శివబాలాజీ ఇంటికి వచ్చిన బిగ్‌బాస్ ఆయనను బిగ్‌బాస్‌లో విన్నర్‌గా నిలిచినందుకే కాదు.. ఆయన నటిస్తున్న 'స్నేహమేరా జీవితం' చిత్రం ట్రైలర్ 1మిలియన్ వ్యూస్‌ని సాధించినందుకు అభినందించాడు. అంతేకాదు ప్రేక్షకులకు కూడా ఓ టాస్క్ ఇచ్చాడు. ఈ చిత్రం కథా సారాంశాన్ని ఒక్క నిమిషం వీడియోలో తీసి పంపిమని కోరాడు. ఈ చిత్ర కథకు దగ్గరగా ఉన్న వీడియో రూపొందించిన వారికి శివబాలాజీని, రాజీవ్ కనకాలను కలుసుకునే అవకాశం కల్పిస్తానని చెప్పాడు. మొత్తానికి శివబాలాజీ తన బిగ్‌బాస్ క్రేజ్‌ని ఈ విధంగా వినూత్నంగా వాడుకోవడం మంచి థాట్ అనే చెప్పాలి.