ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగుపెట్టిన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆర్జీవీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే బయోపిక్ చిత్రం ప్రస్తుతం తెలుగు నాట సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రానికి చిత్తూరు జిల్లా పలమనేరుకి చెందిన వైసీపీ నేత రాకేష్‌రెడ్డి నిర్మిస్తుండటంతో చంద్రబాబుని టార్గెట్ చేస్తూనే ఈ చిత్రం రూపొందనుందనే ప్రచారం ఎక్కువైంది. నిజానికి పలమనేరుకి చెందిన రాకేష్‌రెడ్డిని సినిమా నిర్మించే స్తోమత లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
ఇక తాజాగా వర్మ, రాకేష్‌రెడ్డిలతో జగన్ బావ, షర్మిల భర్త, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ భేటీ కావడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. వీరి భేటీకి చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ భేటీని రాకేష్‌రెడ్డి దృవీకరించాడు. సినిమా చర్చల నిమిత్తం తాను, వర్మ కలిసి జెడి చక్రవర్తి ఆఫీసుకి వెళ్లామని అక్కడి నుంచి భోజనం చేయడం కోసం పార్క్‌హయత్‌కి వెళ్లగా అక్కడ బ్రదర్ అనిల్ కలిశాడని, వర్మకి అనిల్‌ని నేను పరిచయం చేశానని తెలిపాడు. మా మధ్య భోజన సమయంలో ముచ్చట్లు జరిగాయి కానీ సినిమాకి సంబంధించి మాత్రం ఏమీ ప్రస్తావనకు రాలేదని రాకేష్‌రెడ్డి అంటున్నాడు.
అయితే బ్రదర్ అనిల్‌కి క్రైస్తవ మత ప్రచారకుడిగా విదేశాల నుంచి కోట్లు విరాళాలు వస్తాయని, ఒకప్పుడు బ్రదర్ అనిల్ కూటికి లేక ఇబ్బందులు పడేవాడని, మరి ఆయనకు ఇప్పుడు సొంత చార్టెడ్ ప్లయిట్, విలాసవంతమైన జీవితానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇక తన అల్లుడైన బ్రదర్ అనిల్‌ని కె.ఎ.పాల్ కంటే ప్రపంచంలో ప్రాచుర్యం కలిగించేలా చేశాడని, దాంతోనే కె.ఏ.పాల్‌కి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలకు గొడవలు ఏర్పడ్డాయని సన్నిహితులు అంటారు.
కాగా వర్మని బ్రదర్ అనిల్ పార్క్ హయత్ హోటల్‌లో కలిసిన సందర్భంగా 'తమసోమ జ్యోతిర్గమయ' అనే పేరుతో వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని దేవుని వంటి మహానాయకునిగా చూపిస్తూ వర్మని ఓ చిత్రం చేయమని కోరినట్లు, దానికి తానే పెట్టుబడిని పెడతానని వర్మకు చెప్పగా మొదట 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం పూర్తి చేద్దామని, ఆ తర్వాత రాజశేఖర్‌రెడ్డిపై 'తమసోమ జ్యోతిర్గమయ' చిత్రం చేద్దామని వర్మ చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. మొత్తానికి ఈ వివాదం మరింత పెద్దది అయ్యేలా కనిపిస్తోంది.