కళాకారులు అన్న తర్వాత అందరూ కళామతల్లి ముద్దుబిడ్డలే. వీరి మధ్య పెద్ద స్టార్, పెద్ద హీరో, కామెడీ ఆర్టిస్టు, జూనియర్ ఆర్టిస్ట్ అనే భేదాభిప్రాయాలు ఉండకూడదు. జూనియర్ ఆర్టిస్లకి గుర్తింపులేదు... ఫలానా నటుడి కంటే తమకు ఎన్నో రెట్ల కీర్తిప్రతిష్టలు ఉన్నాయనే అహం మంచిదికాదు. ఎవరైనా నటుడు నటుడే. పాతకాలంలో షూటింగ్‌కి వచ్చిన సీనియర్ ఆర్టిస్టులు కూడా దర్శకుడి పాదాలకు నమస్కరించేవారు. ఇక పెద్ద పెద్ద స్టార్స్ కూడా పాటల చిత్రీకరణ సమయంలో కొరియోగ్రాఫర్లకు షూటింగ్ స్పాట్‌కి వచ్చిన వెంటనే, వెళ్లేటప్పుడు నమస్కారం పెట్టేవారు. అలాగే మేకప్ వేసేవారికి నాడు సీనియర్లు ఇచ్చే గౌరవం మరలా తిరిగిరాని రోజులనే చెప్పాలి.
ఇక బుల్లితెరపైనే పెద్ద ఆర్టిస్ట్ అయినా వెండితెర మీద చిన్నచిన్న పాత్రలు చేసే అచ్యుత్ అంటే నాటి స్టార్స్‌కి ఎంతో గౌరవం. ఇక 'శివ' చిత్రంతో పరిచయమైన జితేందర్రెడ్ది అలియాస్ చిన్నా కోట శ్రీనివాసరావు వంటి గొప్పనటుడిని, ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిని ఇప్పటికీ కోటయ్యా అనే పిలుస్తాడు. ఇలాంటి గౌరవాలు ఇండస్ట్రీలో తగ్గిపోతున్నాయని, తమను కనీసం గౌరవించడం లేదని కైకాల సత్యనారాయణ సైతం ఒకానొక దశలో కన్నీరు పెట్టుకున్నాడు. ఇక హీరోల అభిమానుల మధ్య మరీ వైరాలు అనేవి ఎన్టీఆర్ నటనా ప్రస్థానం చివరిరోజుల్లో కృష్ణకి ఆయనకు వచ్చిన పట్టింపుల వల్ల మొదలై ఆ దావానలంలా వ్యాపిస్తూనే ఉంది. ఇక సినిమాలలో కుల ప్రస్తావన కూడా ఎన్టీఆర్, ఏయన్నార్ల హయాం నుంచే ప్రారంభమయ్యాయని సీనియర్లు చెబుతారు. ఇక ఆ తర్వాత బాలకృష్ణ, చిరంజీవి.. ఆతర్వాత ఇప్పుడు పవన్‌కళ్యాణ్, ప్రభాస్,మహేష్ ఇలా కొనసాగుతూనే ఉంది. అయినా కిందటి తరంతో పోల్చుకుంటే నేటియంగ్ స్టార్స్ క్లోజ్‌గా ఉండటం, ఒకరికి ఒకరు విషెష్ చెప్పడం,ఒకరి వేడుకలకు మరోకరు ఉత్సాహంగా వచ్చి సందడి చేయడం ఆహ్వానించదగిన పరిణామం.
ఇక నిన్నటితరంలో బిజీ కామెడీ ఆర్టిస్ట్‌గా, రాజకీయనాయకునిగా కోటశ్రీనివాసరావు, బాబూమోహన్లు ఓ హవా సృష్టించారు. తాజాగా బాబూ మోమన్ మాట్లాడుతూ, 'నన్ను అక్కినేని నాగేశ్వరరావు గారు ఎప్పుడు పేరు పెట్టి కూడా పిలవలేదు. 'అందగాడా.. కమాన్' అనేవారు. ఆయనది అంత గొప్ప మనసు. నాతోఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉండేవారు' అని చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రులు టీచర్లుగా ప్రభుత్వోద్యోగం చేసేవారని, వారు సీనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానులని, వారు తనకు చిన్నప్పుడు 'నువ్వు బాగా చదువుకోవాలి. నీ జన్మ ధన్యం కావాలంటే మద్రాస్ వెళ్లి ఎన్టీఆర్ గారిని దగ్గరగా చూడాలిరా' అనేవారు. నేనేమో స్కూల్ ఫైనల్ పూర్తి చేసి బతకడానికి ఓ ఉద్యోగం ఉంటే చాలని అనుకునేవాడినని చెప్పుకొచ్చారు.