ఎంత కాదన్నా బాలకృష్ణ ప్రయోగాలు చేయడంలో, విభిన్న తరహా పాత్రలు చేయడంలో, న్యూటాలెంట్‌ని నమ్మి చిత్రాలు తీయడంలో ఆయన ముందుంటారనేది వాస్తవం. సీనియర్ స్టార్స్‌లో 'ఆదిత్య 369, భైరవద్వీపం, పాండురంగడు, శ్రీరామరాజ్యం, గౌతమీపుత్ర శాతకర్ణి'.. ఇలా చేయడం బాలయ్యకే చెల్లింది. ఇక ఆయన ఎప్పటి నుంచో తనకు మంచి యాంటీరోల్ చేయాలని ఉందని చెబుతూ వస్తున్నాడు.
తాజాగా ఆయన మరోసారి తన కోరికను వెలిబుచ్చాడు. మంచి నెగటివ్‌షేడ్స్ ఉన్న పాత్రలు వస్తే నటించి మెప్పించాలని ఉందని చెప్పాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో కమల్‌హాసన్, సూర్య, కార్తి , విక్రమ్ వంటి వారు నెగటివ్ రోల్స్‌లో చేసి మెప్పించారు. ఇక తాజాగా అబ్బాయ్ 'జైలవకుశ'లో కూడా జై వంటి నెగటివ్ షేడ్స్ పాత్రలో ఇరగదీసి, ఆ పాత్రతోనే సినిమాను ఒంటిచేత్తో నిలబెట్టాడు. ఇక నాటి ఎన్టీఆర్ కూడా ఎన్నో ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో మెప్పించాడు. ఇవ్వన్నీ చూసిన తర్వాత బాలయ్యలో ఈ కోరిక మరింత బలంగా నాటుకుందేమో అనిపించకమానదు.
అందునా కూడా ఇప్పుడిప్పుడే తెలుగు ఆడియన్స్, అభిమానుల్లో కూడా మార్పు వస్తోంది. హీరో సినిమా చివరలో చనిపోయినా, లేదా విలన్‌గా నెగటివ్ పాత్రలు చేసినా మా హీరో వైవిధ్యంగా చేశాడని గొప్పగా చెప్పుకుంటూ చిత్రాలను ఆదరిస్తున్నారు. గతంలోబాలయ్య 'సుల్తాన్, యువరత్న రాణా' చిత్రాలలో హీరోనే అయినప్పటికీ నెగటివ్ చాయలుంటాయి. కానీ అలా కాకుండా పూర్తి నిడివి ఉండే ప్రతినాయక పాత్ర బాలయ్యకు వస్తే చేయడం గ్యారంటీ అని తెలుస్తోంది. మరి బాలయ్య కోరిక రూపుదాలిస్తే నందమూరి అభిమానులు ఆదరిస్తారా? లేదా? అన్నది ముఖ్యం.