తాజాగా విడుదలైన తమిళ చిత్రం 'మెర్సల్' తమిళనాట సంచనాలు రేపుతోంది. ఈ చిత్రంలో విజయ్ ఏకంగా మోదీనే టార్గెట్ చేశాడు. మోదీ చేపట్టిన డీమానిటైజేషన్, జీఎస్టీ, డిజిటల్ ఇండియాపై నిప్పులు చెరిగాడు. అన్నింటికీ వర్తించే జీఎస్టీ పరిధిలోకి కార్పొరేట్ వైద్యం, పెట్రోల్ ఎందుకు రావని నిలదీశాడు. ఇక ఇందులో కార్పొరేట్ వైద్యంపై విజయ్ పోరాటం చేశాడు. డాక్టర్లు ఉన్నది ప్రజలను దోచుకుని డబ్బులు సంపాదించడానికే గానీ పేషెంట్లను పట్టించుకోరని, రోగుల బాధలు డాక్టర్లు పట్టించుకోవడం లేదని తాను వేసిన డాక్టర్ పాత్ర ద్వారానే విజయ్ వైద్యవృత్తిపై నిప్పులు చెరిగాడు. నిజానికి తమిళనాడులో రాజకీయాలకు, సినిమాలకు ఉన్న అవినాభావ సంబంధం తెలిసిందే. దీనిలో విజయ్ కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఆయన నటించిన 'తలైవా' చిత్రాన్ని తమిళంలో విడుదల కాకుండా జయ అడ్డుకుంటే ఆయన తెలుగులో 'అన్న'గా మొదట రిలీజ్ చేశాడు. ఇక కేంద్రంలో మోదీ నియంత, తనపై ఎదురుతిరిగే వారిని ఇబ్బంది పెట్టేరకమని చంద్రబాబు, జగన్‌లు వంగి వంగి నమస్కారాలు పెడుతున్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో పవన్ తప్ప మోదీకి భయపడి ఎవ్వరూ నోరు విప్పడం లేదు. కానీ ఏపీతో పోలిస్తే తమిళనాడుకు కేంద్రం చేసిన అన్యాయం తక్కువే. ఇక తమ రాష్ట్ర రాజకీయాలలో కేంద్రం వేలు పెట్టడాన్ని ఇప్పటికే తమిళ యువత 'జల్లికట్టు'తో కేంద్రానికి వాత పెట్టింది.
ఇక 'మెర్సల్' చిత్రంలో ఆయన మోదీపై పేల్చిన దీపావళి బాంబులను విని తమిళతంబీలు సెహభాస్ అంటున్నారు. అక్కడి బిజెపి నాయకులు ఆ డైలాగ్స్‌ని సెన్సార్ చేయాలని, లేకపోతే కోర్టుకి వెళ్తామంటున్నారు. ఇక గతంలో వెంకటేష్ -తమిళ దర్శకుడు తిరుపతి స్వామి దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన 'గణేష్' చిత్రం సమయంలో వైద్యులు తీవ్రంగా మండిపడి ఉద్యమాలు, నిరసనలు చేశారు. దానిని మించిన స్థాయిలో 'మెర్సల్'లో కార్పొరేట్ వైద్యులపై విజయ్ సెటైర్లు పేల్చాడు. మొత్తం మీద ఈ చిత్రం మొదటి రోజు తమిళనాడులో 'బాహుబలి2' రికార్డులను బ్రేక్ చేసింది. ఫుల్‌రన్‌లో 'బాహుబలి'నే టార్గెట్ చేసింది. 'పులి' ద్వారా చేయలేని పని 'మెర్సల్' ద్వారా విజయే ఈ రికార్డులను బ్రేక్ చేస్తాడేమో చూడాలి...!