సామాజిక బాధ్యత ఉన్న హీరోలలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్‌ని ముందుగా చెప్పుకోవాలి. ఆమద్య చత్తీస్‌గడ్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లను నక్సలైట్లు చంపేసినప్పుడు వారిని ఆదుకుని ముందుగా స్పందించింది అక్షయ్‌కుమార్, క్రికెటర్ గౌతమ్ గంభీర్‌లే. నాడు మరణించిన జవాన్లకు కోట్లలో సాయం అందించారు వీరిద్దరు. తాజాగా దీపావళి సందర్భంగా మహారాష్ట్ర కొల్హాపూర్ రేంజ్ స్పెషల్ ఐజీ విశ్వాస్ నంగరే పాటిల్ 103 అమర జవాన్ల కుటుంబాలకు చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకున్న అక్షయ్‌కుమార్ తాను కూడా వెంటనే స్పందించాడు. ఆ వీర జవాన్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 25వేల రూపాయల ఆర్థిక సాయంతో పాటు పిల్లలకు పుస్తకాలతో ఇతర అవసరాలను కూడా తీర్చడానికి ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన వారికి లేఖ కూడా రాశారు.
ప్రాణత్యాగం చేసిన జవాన్లను చూసి దేశం గర్విస్తోందని చెప్పాడు. మొత్తానికి సేవా కార్యక్రమాలు, అందునా దేశరక్షణ కోసం ప్రాణాలర్పించే జవాన్ల కోసం ఆయన 'జై జవాన్' నినాదాన్ని బాగా విస్తృతం చేస్తున్నాడు. అక్షయ్‌కుమార్ కంటే సంపాదనలో కీర్తి ప్రతిష్టలో ముందున్న ఎందరో మౌనంగా ఉంటున్నా కూడా వారికి ఆదర్శంగా నిలుస్తూ, తన అభిమాలకే కాదు.. అందరిలో ఆయన స్ఫూర్తి నింపుతున్నాడు. ఆయన ఔదార్యం చూస్తే సొంత లాభం కొంత మానుకుని, ఎదుటివారికి తోడ్పడవోయ్.. అని నినదించిన కవి మాటలు గుర్తురాక మానవు.
ఎంతైనా కోట్లాది రూపాయల సంపాదన ఉండే వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులు, సినీనటులతో పాటు ప్రభుత్వాలు కూడా దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని మరిచిపోతూ ఉంటే నేటి సమాజంలో నేటికి స్పందించే హృదయాలు ఉన్నాయని అక్షయ్‌కుమార్ వంటి వారు నిరూపిస్తున్నారు. హ్యాట్సాఫ్ అక్షయ్ హ్యాట్సాఫ్.