ఈమధ్య భారీ ప్రాజెక్ట్‌లు, స్టార్ హీరోల చిత్రాలు ఫ్లాప్ కావడం, దాంతో బయ్యర్లు, ఎగ్జిబ్యూటర్లు తమ నష్టాలను భరించాలని హీరోల దర్శకనిర్మాతల ముందు కూడా ధర్నాలు చేసి అందరి పరువును మంటగలుపుతూ, సినిమా అంటేనే భయపడేలా, ఓ జూదంగా ప్రాజెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ 'లింగా' నుంచి పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్' వరకు 'స్పైడర్' కి కూడా అదే పరిస్థితి. అయితే బయ్యర్లు సినిమా కొనే ముందు నాన్‌రికవబుల్ అమౌంట్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసిన తర్వాత కూడా అందరినీ తప్పు పట్టడం సరికాదు. అదేమని డిస్ట్రిబ్యూటర్లను అడిగితే తమ తదుపరి చిత్రం థియేటికల్ రైట్స్ కూడా మీకే ఇస్తామని, మాటలు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని వాదిస్తున్నారు. దీనికి ఒకటే పరిష్కారం.
నిర్మాణ ఖర్చులు తగ్గి, స్టార్‌హీరోలు కూడా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలన్నా దర్శకులు పోతే నిర్మాతే కదా..! అనే భరోసా నుంచి బయటికి రావాలన్నా కూడా లాభనష్టాలలో వారిని కూడా భాగస్వాములను చేయడం ఒక్కటే మార్గం. ఈ విషయాన్ని ఆల్‌రెడీ 'మిస్టర్' చిత్రంతో పాటు రవితేజ - శ్రీనువైట్లలతో మైత్రిమూవీమేకర్స్ చేస్తున్న చిత్రానికి కూడా అప్లై చేస్తున్నారు. ఇక సినిమా విడుదలై లైట్‌బోయ్ కూడా ఆఖరి పైసా తీసుకున్న తర్వాత.. అది కూడా సినిమా హిట్టయితేనే లాభాలలో వాటాని చివరగా అమీర్‌ఖాన్ తీసుకుంటాడు. ఇక దాదాపు ఇదే పద్దతిని ఫాలో అవ్వాలని టాలీవుడ్‌కి చెందిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు, నిర్మాతలు, దర్శకులు నిర్ణయించుకున్నారట. పూర్తిగా అమీర్ స్థాయిలో కాకపోయినా ఓ చిత్రం చేసేటప్పుడు హీరో, దర్శకుల రెమ్యూనరేషన్‌లో 25 శాతం మొత్తాన్ని నిర్మాతలు తమ వద్దే ఉంచుకుంటారు.
సినిమా ఫ్లాపయి నిర్మాతలకు 25 శాతం పైగా నష్టాలు వస్తే హీరో, దర్శకులు మిగిలిన తమ వద్ద ఉన్న 25శాతం పారితోషికాన్ని నిర్మాతలు బయ్యర్లకు ఇస్తారు. అదే సినిమా ఓకే అనుకుంటే కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన తర్వాతే నిర్మాతలు తమ వద్ద ఉన్న పెండింగ్ అమౌంట్‌ని హీరో, దర్శకులకు ఇస్తారు. దీనికోసం సురేష్‌బాబు, దిల్‌రాజు, సునీల్‌నారంగ్‌లతో కలిపి ఓ త్రిసభ్య కమిటీని నియమించారట. వీరు రేపు సమావేశమై దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి కమిటీ ఓకే చెబితే డిసెంబర్ 22న విడుదల కానున్న అక్కినేని అఖిల్ హీరోగా, నాగార్జున నిర్మిస్తున్న 'హలో' చిత్రం నుంచి దీనిని అమలులోకి తేనున్నారు. ప్రస్తుతం తెలగులోస్టార్ దర్శకుల రెమ్యూనరేషన్ 10 నుంచి 20కోట్లు ఉండగా, స్టార్స్ రెమ్యూనరేషన్ 15 నుంచి 30కోట్ల వరకు ఉందని అంచనా. మొత్తానికి సినిమాకి మూలస్థంభైమైన నిర్మాతలకు ఇది శుభవార్తేనని చెప్పాలి...!