జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో..కీర్తి చౌదరి ప్రొడ్యూసర్ గా..మంచు విష్ణు 'ఆచారి అమెరికా యాత్ర' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కి సిద్ధం అవుతున్నది. ఈ సినిమాలో విష్ణుతో పాటు బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. అయితే ఇది ఇలా ఉండగా.. భాజపా అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై నటుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంలో GST (వస్తు, సేవల పన్ను) గురించి తప్పుగా చూపించారంటూ గత నాలుగైదు రోజులుగా భాజపా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఈ విషయమై నరసింహారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినీ నటులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారు. చాలా మంది భారతీయ నటులకి విషయ పరిజ్ఞానం ఉండదని వ్యాఖ్యానించారు. దాంతో ఆయన వ్యాఖ్యలు చిత్రపరిశ్రమలో దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంచు విష్ణు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నరసింహారావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సినిమా స్టార్లకు జీకే మరియు ఐక్యూ ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా? మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యారన్న విషయం మరువద్దు. వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత ఉన్నారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. క్రిస్టియన్‌ని వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ హిందుత్వాన్ని బాగా నమ్ముతాను. హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతాను. నాకు భాజపాపై గౌరవం ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిని.’ అని పేర్కొన్నారు విష్ణు.
మన టాలీవుడ్ మాత్రమే కాకుండా అటు బాలీవుడ్ నటులు కూడా ఈ విషయమై స్పందిస్తున్నారు. నరసింహారావు వ్యాఖ్యలపై బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ కూడా స్పందించారు. ఇలాంటి మాటలు మాట్లాడటానికి మీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు.