దాసరినారాయణరావు గొప్పగా చెప్పుకునే దర్శకుల్లో కోడిరామకృష్ణ, రేలంగి నరసింహారావుల పేర్లు మొదటగా చెప్పుకోవాలి. పరిస్థితులు సహకరించలేదు గానీ లేకపోతే రేలంగి కూడా శతాధిక చిత్రాలను పూర్తి చేసేవాడే. ఇక తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ ఇస్తూ, తన నిర్మాతల స్థోమతకి తగ్గట్టే తన చిత్రాలను హీరోలు, హీరోయిన్లు, ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంచుకునే వాడు. నిర్మాత ఇబ్బందుల్లో ఉంటే ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణులతో తనకున్న పరిచయాలతో తానే మాట్లాడి తన పారితోషికంతో పాటు వారి పారితోషికాలు కూడా తగ్గించే విధంగా ఒప్పించేవాడు. ఇక ఆయన జంధ్యాల తర్వాత ఈవీవీ ముందు సున్నితమైన భావోద్వేగాలు, మానవీయ విలువలకు తనదైన హాస్యాన్ని దట్టించి ఎమోషన్స్‌ని చూపుతూనే ఎంటర్‌టైన్‌మెంట్‌ని పండించేవాడు. కానీ ఆయన ఓ మంచి చిత్రం తీసినప్పుడు దానికి పోటీగా వచ్చిన ఈ డబుల్ మీనింగ్‌ల చిత్రం విజయవంతమైంది.
దాంతో ఆవేశానికి లోనైన ఆయన తన తదుపరి చిత్రాన్ని తాను కూడా డబుల్‌మీనింగ్‌లు పెట్టి తీశాడు. రేలంగి సినిమా అంటే సకుటుంబసపరివార సమేతంగా ఉంటుందని, ఫ్యామిలీలంతా మొదటి రోజు సినిమా చూడటానికి వచ్చి.. ఛీ.. ఇలాంటి సినిమా తీస్తాడా? అని ఆయనను ఎదురుగానే చాలా మంది తిట్టారు. ఈ సంఘటన ఇప్పటికీ ఆయన తలుచుకుని అలాంటి సినిమా చేయాల్సింది కాదని బాధపడుతూ ఉంటాడు. ఇక ఆయన చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి వారితోనే కాదు ఏయన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు వంటి పెద్దవారితో కూడా పనిచేశాడు. ఇక ఆయన కృష్ణ గురించి తాజాగా చెబుతూ, శోభన్‌బాబుతో తీసిన 'సంసారం' చిత్రం చూసిన కృష్ణ గారు తన తదుపరి చిత్రానికి నన్ను దర్శకునిగా తీసుకోమని శాఖమూరి రామచంద్రరావుకి చెప్పారు. కృష్ణ, శాఖమూరి ఇద్దరు బంధువులు. ఆయన ఓకే అని చెప్పి నన్ను దర్శకునిగా పెట్టుకున్నాడు.
దాంతో రచయితగా సత్యానంద్‌ని తీసుకుని ఆయనతో సిట్టింగ్స్ జరుపుతున్న దశలో ఆ నిర్మాత నాకు చెప్పకుండా పరుచూరి బ్రదర్స్‌కి రచయితలుగా పనిచేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు. సత్యానంద్ గారితో సిట్టింగ్స్ వేస్తున్న నేను దానిని జీర్ణించుకోలేకపోయాను. దాంతో సత్యానంద్ ఉండాల్సిందే లేకపోతే నేను కూడా పనిచేయనని శాఖమూరికి చెప్పాను. సత్యానంద్ చేత అంత పనిచేయించి ఆయన లేకుండా నేను ఒక్కడినే పనిచేయడం నాకు నచ్చలేదు. దాంతో ఈ చిత్రం చేయకుండా బయటికి వచ్చేశాను. కానీ ఆ నిర్మాత.. రేలంగికి ఈ చిత్రం ఇష్టం లేదంటున్నాడు అని కృష్ణగారికి తప్పుగా చెప్పారు. దాంతో కృష్ణగారికి కోపం వచ్చింది. అది తెలిసి నేను ఆయన వద్దకు వెళ్లి విషయం మొత్తం చెప్పాను. ఆయన విని తర్వాత చేద్దాంలే అని చెప్పారు అని చెప్పుకొచ్చాడు. నిజంగా నేటి రోజుల్లో పక్క టెక్నీషియన్ కోసం సినిమాలను త్యాగం చేసే దర్శకులు ఉన్నారా? అనే అనుమానం రాకమానదు....!