ప్రస్తుతం ఇలయదళపతి విజయ్ నటించిన 'మెర్సల్' చిత్రం వివాదం రోజురోజుకీ రాజుకుంటోంది. డివైడ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్లలో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కేంద్రంపై విజయ్ నిప్పులు చెరిగాడు. ఆయన లేవనెత్తిన సినిమాలోని ఏ ప్రశ్నకు బిజెపి వద్ద సమాధానం లేదు. దాంతో తమపై ప్రేక్షకుల్లో, ప్రజల్లో పరువుపోతుందని గమనించిన బిజెపి నేతలు దీనికి మతం రంగు పులమాలని ప్రయత్నిస్తున్నారు. సినిమాలో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా బిజెపి నేతలు కప్పదాటు వ్యవహారాలు, మతం రంగు పులిమి తిమ్మిని బమ్మిని చేయాలని చూస్తున్నారు. ఇక తాజాగా తమిళనాడు బిజెపి అధ్యక్షుడు హెచ్.రాజా తాను పైరసీ చూశనని చెప్పడంతోపాటు విజయ్ అసలు హిందువు కాదని, ఆయన పేరు సి.జోసఫ్ విజయ్ అని, ఆయన మతం మార్చుకున్నాడని, ఆయన ఓటర్ ఐడీని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. నిజానికి విజయ్ మతానికి, విజయ్ ఈ చిత్రంలో చెప్పిన సెటైర్లకు ఏమైనా సంబందం ఉందా? బిజెపి విధానమే అది అని ఎవరైనా విమర్శిస్తే దానికి ప్రతి సమాధానం చెప్పకుండా ప్రతిదానికి మతం రంగుని పులుముతోందని విమర్శకులు మండిపడుతున్నారు.
విజయ్ క్రిస్టియన్ అని, అందుకే ఆయన 'మెర్సల్' చిత్రంలో 'దేవాలయాలు కట్టకపోయినా ఫర్వాలేదు... ముందు ఆసుపత్రులు' కట్టండి అని విజయ్ డైలాగ్ చెప్పాడని, మరి చర్చిల బదులు ఆసుపత్రులు కట్టమని ఎందుకు అనలేదని బిజెపి నాయకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాలంటే చర్చిలు, మసీదులు అన్ని వస్తాయని ఈ బిజెపి నేతలకు తెలియకపోవడం విడ్డూరం. ఇక విజయ్‌ని క్రిస్టియన్ అని ఆరోపించడంపై విజయ్ తండ్రి చంద్రశేఖరన్ బిజెపి నేతలపై నిప్పులు కక్కాడు. విజయ్ హిందువో, ముస్లిమో, క్రిస్టియనో కాదని, ఆయన మనిషని, అంతకన్నా ముఖ్యంగా ఆయన భారతీయుడని కౌంటర్ ఇచ్చాడు. తన పేరు చంద్రశేఖరన్ అని అది శివుడి పేరని ఆయన తెలిపారు. ఇక విజయ్ ఇలాంటి అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలలోకి రావాలని ఆయన తండ్రిగా కాకుండా ఓ మనిషిగా కోరుతున్నానని, కానీ అది విజయ్ నిర్ణయమని, ఇందులో తన ఒత్తిడి ఉండదని చెప్పాడు.
తాజాగా మరో చిత్రంలో కూడా జీఎస్టీపై వేసిన చురకలు సంచలనం సృష్టిస్తున్నాయి. జీఎస్టీ వల్ల మనం తినే హోటల్‌లోని భోజనం, ఇడ్లీ, దోశల వంటి అన్నిరేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. నటుడు, రేడియో జాకీ అయిన బాలాజీ నటించిన 'కీ' చిత్రంలో కూడా నువ్వు నేను హోటల్‌కి వెళ్లితే మరో ఇద్దరి తలలపై కూడా రేటు వేస్తారు. అదే జీఎస్టీ.. ఎందుకు, ఏమిటి? అనేది తెలియడం లేదు. కడుపు మండిపోతోంది...ఈ సెటైరికల్ సీన్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.