సినిమా హాళ్లలో ప్రతి షో ముందు జాతీయగీతాన్ని ప్రదర్శించాలని, ప్రేక్షకులు విధిగా నిలబడి జాతీయగీతాన్ని ఆలపించాలని కేంద్రం చేసిన ఆదేశాలు నాడు పలువురికి నవ్వు తెప్పించాయి. ఎంత సమయం అనేది ముఖ్యం కాదు. అందరూ విధిగా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించడానికి ఎవ్వరికి ఇబ్బందిలేదు. అయితే దేశభక్తిని ప్రజలపై మోపడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పి, దానిని సవరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రతి భారతీయుడు విధిగా జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని ఆలపించడం, ఆ గీతం సాగుతున్నంత సేపు నిలబడటాన్ని గర్వంగానే ఫీలవుతాడు.
కానీ సన్నిలియోన్, షెర్లిన్ వంటి వారు చేసే ఏ గ్రేడ్ చిత్రాలకు వచ్చే ప్రేక్షకులు ఎవరు? వారు ఆయా సినిమాల ముందు జాతీయగీతాన్ని ఆలపించమనో, లేచినిలుచోమనో చెబితే దానికి విలువేముంటుంది? క్రికెట్‌లోనో, మరో ఆటలోనో వెర్రి అభిమానం చూపి, జెండాలు పట్టుకోగానే వారు దేశభక్తులైపోతారా? అలా చేయని వారు దేశద్రోహులేనా? మరి దేశంలో ఎన్నో రాజకీయపార్టీలు, వాటి కార్యాలయాలు ఉన్నాయి. మరి వాటిల్లో రోజు ఉదయాన్నే జాతీయ గీతం ఎందుకు ఆలపించరు? షాపింగ్ మాల్స్ నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలలో ప్రతి రోజు జనగణమనని ఎందుకు ఆలపించేలా కేంద్రం చర్యలు తీసుకోలేదు? అనే ప్రశ్నలు ఉదయించకమానదు.
బిజెపి విధానం ఏమిటంటే.... బిజెపికి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందు పరిషత్ వంటి వారిలోని వారికే దేశభక్తి ఉందని వారు భావిస్తూ ఉంటారు. జాతీయ వాదం పేరుతో తమను మించిన దేశభక్తులు లేరన్నట్లుగా, తామే నిజమైన దేశభక్తికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా ఫీలవుతారు. వారిని విమర్శిస్తే చాలు అదేదో దేశద్రోహం కింద పరిగణిస్తారు. ఇవే అంశాలను బహుభాషా నటుడు అరవింద్‌స్వామి కూడా ప్రస్తావించారు. జాతీయ గీతం పాడటాన్నిగౌరవంగా, గర్వంగా భావిస్తానని, కానీ ఈ జాతీయ గీతాలాపనను అన్నిచోట్లా ఎందుకు ప్రవేశపెట్టడంలేదు? అని ఆయన సూటిగా వేసిన ప్రశ్నలకు బిజెపి కేంద్ర సర్కార్ వద్ద జవాబులేదనే అర్థమవుతోంది.