తమిళనాటే కాదు.. దేశవ్యాప్తంగా 'మెర్శల్' చిత్రం సృష్టిస్తున్న సంచలనాలు అన్నిఇన్నీ కావు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వంపై జీఎస్టీ, డిజిటల్ ఇండియా, పెద్ద నోట్ల రద్దు వంటి వాటిపై సెటైర్లు వేస్తూనే మరోపక్క వైద్యవృత్తిని వ్యాపారంగా మారుస్తున్న కార్పొరేట్ వైద్యం, వైద్యులపై విమర్శలు ఎక్కు పెట్టడంతో ఈ చిత్రం వివాదాల నడుమ కూడా దూసుకుని పోతోంది. ఈ చిత్రానికి, అందులోని డైలాగ్స్‌కి ఎలా అనుమతి ఇచ్చారు? సెన్సార్ వారు మరలా ఈ చిత్రాన్ని సెన్సార్‌చేయాలని బిజెపి నాయకులు అంటూనే ఈ చిత్రానికి మద్దతు తెలిపిన విశాల్ ఆఫీస్‌పై 51 లక్షలు జీఎస్టీని ఎగ్గొట్టాడని దాడులు చేయించి, ఐటీ శాఖ ద్వారా నోటీసులు జారీ చేశారు. తన గురించి పట్టించుకోవద్దని, దేశంలో రాష్ట్రంలో తనకున్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలే ఉన్నాయని, తనకు నోటీసుల విషయంలో తానే తాడో పేడో తేల్చుకుంటానని విశాల్ అభిమానులకు సూచించి తన గట్స్‌ని నిరూపించుకున్నాడు.
ఇక ఈ చిత్రం పైరసీని స్వయాన బిజెపి నాయకులు, మద్దతుదారులు, డాక్టర్లు బాగా ప్రోత్సహిస్తున్నారు. అయినా కూడా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 170కోట్లు వసూలు ఖాయమని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ఈ విషయంపై విజయ్ తొలిసారిగా నోరు విప్పాడు. బిజెపి నాయకులు తనకు మతం రంగు పులమాలని చూసిన దానికి ధీటుగానే ఆయన సి.జోసఫ్‌విజయ్ పేరుతో తన లెటర్ హెడ్ మీద స్టేట్‌మెంట్ విడుదల చేశాడు. ఈ చిత్రం రాజకీయలకు అతీతంగా మంచివిజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. మీ చేయూతే నన్ను ముందుకు నడిపిస్తోంది. ఈ చిత్రం మంచివిజయం సాధించేలా చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు రుణపడిఉంటాను.
ఇక ఈచిత్రం విజయంతోపాటు వివాదాలు కూడా సృష్టించింది. ఈ విషయంలో నాకు మద్దతుగా నిలిచిన ఈ చిత్రం యూనిట్, తోటి నటీనటులు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇండస్ట్రీ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను... అని తెలిపాడు. ఇక మీడియా, జాతీయ ప్రాంతీయ పార్టీలు నన్ను బలపరిచినందుకు అందరికీ పేరు పేరునా దన్యవాదాలు తెలుపుతున్నానని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే ఆయన తన స్టేట్‌మెంట్‌లో ఏ వివాదాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించకుండా 'వివాదాలు' అనే పదమే వాడటం విశేషం.