ఈ మధ్యన రానా అన్ని రకాలుగా దూసుకుపోతున్నాడు. హీరోగా, విలన్ గా వ్యాపార రంగంతో పాటే యాంకరింగ్ రంగంలోనూ రానా అదరగొట్టేస్తున్నాడు. విలన్ గా బాహుబలితో హిట్ కొట్టిన రానా.. 'నేనే రాజు నేనే మంత్రి, ఘాజీ' సినిమాలతో హీరోగా మంచి హిట్స్ అందుకున్నాడు. అలాగే యాంకర్ గా నానితో కలిసి ఐఫా ఉత్సవం 2017 అవార్డు ఫంక్షన్ కి అదిరిపోయే లెవల్లో యాంకర్ గా అదరగొట్టేశాడు. ఆరడుగుల ఆజానుబాహుడు రానా వాక్స్చతుర్యంతో అందరిని పడేశాడు. యాంకర్ గా 100 కి 200 మార్కులు వేయించుకున్నాడు.
అయితే ఇప్పుడు మరో పెద్ద ఈవెంట్ లో రానా తన యాంకరింగ్ తో అదరగొట్టబోతున్నాడనే టాక్ వినబడుతుంది. ఆ వేడుక ఏదో కాదు... సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 2.0 ఆడియో ఫంక్షన్ కు రానా యాంకరింగ్ చేయబోతున్నాడు. దుబాయ్ లో మరి కొన్ని గంటల్లో మొదలు కానున్న ఈ ఆడియో వేడుకలో రానా తన యాంకరింగ్ తో అతిరధ మహారధులను ఆకట్టుకోబోతున్నాడు. ఇక ఆడియో వేడుక కోసం రానా ఇప్పటికే దుబాయ్ చేరుకున్నాడు.... అక్కడికి చేరుకున్న రానా మరిన్ని మెరుపులు కోసం చూస్తూనే ఉండండి.. అంటూ తెగ సస్పెన్స్ లో పెట్టేస్తున్నాడు.
మరి 2.0 అడియో కోసం దుబాయ్ చేరుకున్న రజినీకాంత్, హీరోయిన్ అమీ జాక్సన్, దర్శకుడు శంకర్, విలన్ అక్షయ్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్, లైకా అధినేతలు ఇప్పటికే అక్కడ 2.0 ప్రెస్ మీట్ అంటూ హడావిడి మొదలెట్టేశారు. ఇక ఈ ఆడియో వేడుక కోసం లైకా అధినేతలు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికే అతిధులను స్పెషల్ ఫ్లైట్స్ లో దుబాయ్ కి తీసుకొచ్చేశారు. మరి కొన్ని గంటల్లోనే శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ 2.0 ఆడియో వేడుక అంగరంగ వైభవంగా దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో జరగబోతుంది.