ఒక సినిమా విజయంలో ఎక్కువ భాగం అందులో నటించిన హీరోకే వెళ్ళిపోతుంది. మొన్నటికి మొన్న 'రాజుగారి గది2' క్రెడిట్ మొత్తం నాగార్జున, సమంతలు పట్టుకుపోయారు. అసలు దర్శకుడు ఓంకార్ గురించి ఎక్కడా వినబడలేదు. అలాగే 'రాజా ది గ్రేట్' సినిమాకి మాత్రం హీరో రవితేజతో సమానంగా దర్శకుడు అనిల్ కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు తాజాగా ఇండస్ట్రీ లో టాక్ అఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి దర్శకుడిగా చేసిన మూడు సినిమాల్లో తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులని మెప్పించాడు.
తాజాగా 'రాజా ది గ్రేట్' తో మంచి సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం తన తదుపరి సినిమాని లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడికి గీతా ఆర్ట్స్ నుండి ఫోన్ వచ్చిందనే న్యూస్ ప్రచారంలో ఉండగా ఇప్పుడు అనిల్ రావిపూడి తాజాగా హీరో నితిన్ కి ఒక లైన్ ని వినిపించాడని టాక్ వినబడుతుంది ఆ స్టొరీ లైన్ నచ్చిన నితిన్ వెంటనే అనిల్ తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు అని కూడా చెబుతున్నారు. 'బెంగాల్ టైగర్' నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం హీరో నితిన్ 'లై' ఫ్లాప్ తో కాస్త నిరాశ చెందినా.... ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఒక సినిమాని పట్టాలెక్కించి శరవేగంగా షూటింగ్ జరిపేసుకుంటున్నాడు. ఈ సినిమా నుండి నితిన్ ఫ్రీ అవ్వగానే అనిల్ రావిపూడి సినిమాని స్టార్ట్ చేస్తాడంటున్నారు. ఈ లోపు అనిల్ రావిపూడి కూడా స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉంటాడని వినిపిస్తుంటే.. రాజా ది గ్రేట్ తర్వాత నేనెవర్ని కలవలేదని, ఎవరికి కథ చెప్పలేదని, వస్తున్నా వార్తల్లో నిజం లేదని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ లో తెలిపారు. నితిన్ తో అనిల్ రావిపూడి సినిమా అనేది గాలివార్త మాత్రమే అనే క్లారిటీ వచ్చేసింది.