నేటితరం నటీమణుల విషయానికి వస్తే కెరీర్ ప్రారంభంలో ఏ చిత్రం వచ్చినా నటించేస్తూ ఉంటారు. ఎలాంటి పాత్రలనైనా పోషిస్తారు. అలా మెల్లిగా ఓ స్థాయికి వచ్చిన తర్వాత మాత్రం తాము ముందు నటించిన పాత్రలు ఎందుకుచేశామో తెలియదని, చెత్త పాత్రలను చేశామని, దర్శకులు మాయమాటలు చెప్పి తమను తప్పుగా చూపించారని ఎత్తిపొడుస్తూ ఉంటారు. ఇక మరికొందరు భామలు ఇండస్ట్రీని వదిలి ఏ బాలీవుడ్ వంటి చోట్ల అవకాశాలు వస్తే తమను కెరీర్ ప్రారంభంలో ఆదరించిన ఇండస్ట్రీని, ప్రేక్షకులనే కాదు.. దర్శకనిర్మాతలను కూడా ఎగతాళి, వ్యంగ్యాలు, సెటైర్లు వేస్తుంటారు. దీనికి తాప్సి, ఇలియానా, ఆసిన్, తమన్నావంటి వారు ఉదాహరణ.
ఇక తాజాగా అక్కినేని కోడలు అయిన తర్వాత సమంత కూడా తాను చేసిన పాత చిత్రాలను చూస్తే అందులో నేనెందుకు నటించానా? అనిపిస్తోందని వ్యాఖ్యలు చేసి అవకాశం ఇచ్చిన వారిని, ఆదరించిన ప్రేక్షకుల మనసులను గాయపరిచింది. ఇప్పుడు తాను కూడ అదే ధోరణిలో మాట్లాడుతోంది హాట్ యాంకర్ ప్లస్ నటి రష్మి. ఈమె కీలకపాత్ర పోషించిన 'నెక్ట్స్ నువ్వే' చిత్రం ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ, తాను నటించిన కొన్ని చిత్రాల విషయంలో వల్గారిటీ ఉందని, ఆయా పాత్రలలో నన్ను అలా దర్శకులు చూపిస్తారని తాను భావించలేదని చెబుతూ, తనను తప్పుగా చూపించడం తన తప్పు కాదని, దర్శకుల మోసమేనన్నట్లు మాట్లాడింది.
ఇక 'గుంటూర్‌టాకీస్' చిత్రంతో తానేమి అసభ్యంగా కనిపించలేదని చెబుతూ, ప్రేక్షకులు, అభిమానులు కూడా తానేమి అసభ్యంగా కనిపించానని ఫీలవ్వలేదని చెప్పి బాంబ్ పేల్చింది. వృత్తిలో తాను బిజీగా ఉండటం సంతోషంగా ఉందని, గ్లామర్ పాత్రల్లో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని, సిల్క్‌స్మిత, జయమాలిని, జ్యోతిలక్ష్మి తరహా పాత్రలైనా చేస్తానని కానీ దర్శకులు, నిర్మాణ సంస్థలను బట్టి మాత్రమే తాను ఒప్పుకుంటానని చెబుతూ, సినిమాలలో కాస్త మాస్ ఉంటేనే ప్రేక్షకులు సంతోషిస్తారని, తన అభిప్రాయాన్ని ప్రేక్షకుల అభిప్రాయంగా మార్చేసింది ఈ జాణ.