రాజకీయ రంగంలోని నాయకులపైనే కాదు.. సినీ ప్రముఖుల విషయాలలో వచ్చే గాసిప్స్, రూమర్స్‌ని అందరు ఆసక్తిగా ఫాలో అవుతారు. అసలు రాజకీయనాయకుల విషయాల కంటే సినీ సెలబ్రిటీల గాసిప్స్‌కే ఎక్కువ మైలేజ్ ఉంటుంది. అవి నిజమో కాదో తెలియకపోయినా అందరూ అదే మాటలు నిజమని నమ్ముతుంటారు. ఇక ఒక చిత్రంలో నటించిన హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ స్క్రీన్‌పై బాగా పండినా, వారిద్దరు కలిసి ఏదైనా పార్టీకి వెళ్లినా కూడా వారిద్దరి మధ్య ఎఫైర్‌ని మనవారు అంటగట్టి పారేస్తారు.
ఇక సినిమా మీడియా కూడా ఇందులో ముందుంటి. ముందుగా కేవలం స్నేహంతో మొదలెట్టి అదే మ్యాటర్‌ని మనవారు ఎఫైర్లు, పెళ్లిళ్లే కాదు.. కొందరైతే పిల్లలు కూడా పుట్టారనేంతగా ఈ గాసిప్స్ సాగుతుంటాయి. అందులోనూ మన పెద్దలు మౌనం అర్ధాంగీకారం అన్నారు కాబట్టి సదరు వ్యక్తులు వాటిని పట్టించుకుంటే మరింతగా ప్రచారం సాగుతుందని మౌనంగా ఉంటే సదరు నటీనటులు మౌనంగా ఉన్నారు.. ఖండించడం లేదంటే దానినే నిజమని నమ్మాల్సి వస్తుంది. మీడియా చెప్పిన సంగతులు నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, రాజశేఖర్-జీవిత, నాగచైతన్య-సమంతల విషయంలో నిజమై ఉండవచ్చు. అలాగని మీడియాలో వచ్చే ప్రతి ఎఫైర్ నిజం కావాల్సిన పనిలేదు. ఇక ఇలాంటి వార్తల వల్ల సంసార జీవితాలు కూడా నాశనమైపోతుంటాయి.
ఇక విషయానికి వస్తే తాజాగా నితిన్ హీరోగా హనురాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'లై' చిత్రం వైవిధ్యభరితమైన చిత్రం అయినా పెద్దగా ఆడలేదు. కానీ స్క్రీన్‌పై నితిన్, మేఘాఆకాష్ కెమిస్ట్రీ చూసి నితిన్, మేఘాఆకాష్ మధ్య ప్రేమ చిగురించిందని, పర్సనల్‌గా ఎంజాయ్ చేస్తున్నారని, నితిన్ మీద ఇష్టంతోనే మేఘాఆకాష్ నితిన్ చిత్రానికి మరోసారి డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందని పుకార్లు మొదలయ్యాయి. దాంతో ఆమె కాస్త ఆలస్యంగానైనా స్పందించింది. తనకు నితిన్‌కి ఎలాంటి ప్రేమదోమ లేదని తేల్చేసింది. నిర్మాతలు డేట్స్ అడ్జస్ట్‌మెంట్ కోరడంతోనే తాను డేట్స్ అడ్జస్ట్ చేశానని, అంతకు మించి ఏమీలేదని చెప్పడంతో ఇప్పటికైనా ఈ వార్తలకు అడ్డుకట్ట పడతాయని భావించవచ్చు.