హాస్యనటుడు బ్రహ్మానందం తనయునిగా గౌతమ్ హీరోగా ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన నటించిన మొదటి చిత్రం 'పల్లకిలో పెళ్లికూతురు'. ఆ తర్వాత 'వారెవ్వా, బసంతి' వంటి చిత్రాలు చేసినా అవి అనుకున్నంతగా నిలబెట్టలేకపోయాయి. గౌతమ్ స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఎవ్వరినీ ఆకట్టుకోలేకపోయింది. దాంతో ఈయన చాలా గ్యాప్ తీసుకుని 'మను' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ప్రస్తుతం లో బడ్జెట్ చిత్రాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలు కూడా సినిమాలో కంటెంట్ బాగా ఉంటే మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇక షార్ట్ ఫిలిం మేకర్స్ కూడా దర్శకులుగా మారి, తమలోని వైవిధ్యాన్ని, టాలెంట్‌ని చూపిస్తున్నారు. కాగా ఈ 'మను' అనే చిత్రం ద్వారా 'మధురం, బ్యాక్‌స్పేస్' వంటి షార్ట్ ఫిలింస్ ద్వారా ఆకట్టుకున్న ఫణీంద్ర దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. కాగా ఈ చిత్రం విషయంలో మరో ఆసక్తికర విషయం ఉంది. ఈ చిత్రాన్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మించారు.
ఈ చిత్రం కోసం ఫండింగ్ కావాలని సోషల్ మీడియాలో ప్రకటన ఇవ్వడంతో రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది. క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఏకంగా కోటి 20లక్షలు వచ్చాయట. ఈ డబ్బుతోనే సినిమాని నిర్మించారు. ఫిబ్రవరిలో రానున్న ఈ 'మను' చిత్రం విడుదలైతే ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా మరిన్ని చిత్రాలు రూపొందే అవకాశం ఉంది. తెలుగులో ఈ విధానం ద్వారా రూపొందిన తొలిచిత్రంగా 'మను' రికార్డు సృష్టించింది. మరి థియేటర్లలో, కలెక్షన్లలో కూడా రికార్డును సృష్టిస్తుందో లేదో వేచిచూడాల్సివుంది...!