సినిమాలు మొదలైన కాలం నుంచి ఏ కథను తీసుకున్నా అది రామాయణం, భారతం, భాగవతం వంటి వాటి పాత్రలను, వాటిలోని ఘట్టాలను తీసుకునే కథలను రాసుకుంటారు. ఇతిహాసాలను సాంఘికంగా మార్చడంతోనే అసలు కథ మొదలవుతుంది. ప్రతి కథకు అదే ఇతిహాసాలు స్ఫూర్తిగా ఉంటాయి. సినిమా అంతంలో జరిగే దుష్టశిక్షణ, శిష్ట రక్షణ నుంచి హీరోలను రాముడు, కృష్ణుడు, కర్ణుడు, ధుర్యోధనుడు ఇలా వారిలోని సుగుణాలను మేళవించే కొత్త కొత్త కథలు పుట్టుకొస్తాయి.
తాజాగా 'బాహుబలి' చిత్రంలోని అమరేంద్ర బాహుబలి, శివగామి పాత్రలను కూడా రామాయణంలోని పాత్రలతో పోల్చి సీనియర్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తనదైన విశ్లేషణ చేశాడు. కట్టప్ప అమరేంద్ర బాహుబలిని చంపే సన్నివేశంలో ప్రభాస్ నటన అమోఘం. కొన్ని పాత్రల కోసమే కొందరు పుడతారని అంటారు. అలా 'బాహుబలి' కోసమే ప్రభాస్ పుట్టాడని అనిపిస్తుంది. అంత గొప్పగా ఆయన నటించాడు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రలను శ్రీరాముడి పాత్ర స్ఫూర్తితో రూపొందించారని అర్ధమవుతోంది.
శ్రీరామునిలోని ధీరత్వం, సచ్చీలత, స్వచ్చత వంటివన్నీ ఆ పాత్రలో కనిపిస్తాయి. తల్లిగాని తల్లి పినతల్లి కైక మాటను అనుసరించి రాముడు అడవులకు వెళ్లాడు. ఇక తల్లిగాని తల్లి శివగామి మాట విని దేవసేన కోసం అమరేంద్ర బాహుబలి రాజ్యాన్ని వదిలేశాడు. ఆ పాత్రలకు సూర్తి ఎవరని ఈ చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్‌ని అడిగితే ఆయన శ్రీరాముడు, కైక అని ఖచ్చితంగా చెబుతాడు.. అంటూ 'బాహుబలి'లోని ప్రత్యేకతలను తనదైనశైలిలో పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషించారు.